Dharani : భూ సమస్యల అధ్యయానికి లీఫ్స్ ‘యాచారం’ మోడల్!

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-28 03:03:54.0  )
Dharani : భూ సమస్యల అధ్యయానికి లీఫ్స్ ‘యాచారం’ మోడల్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నాలుగేండ్లలో భూ సమస్యలు పెరిగిపోయాయి. ధరణి పోర్టల్ వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దరఖాస్తులు చేసుకున్నా లక్షలాది అప్లికేషన్లు పెండింగులో ఉండిపోయాయి. అయితే భూ సమస్యలపై ధరణి కమిటీ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ నేతృత్వంలో లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) అనే సంస్థ రంగారెడ్డి జిల్లా యాచారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని స్టడీ చేసింది. ఇక్కడ సమస్యలను గుర్తించి.. పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి సమర్పించింది. అందుకే ధరణి పోర్టల్, భూ సమస్యల పరిష్కారానికి సమగ్ర అధ్యయనం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తించారు. ఈ క్రమంలోనే మరో మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి స్టడీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

పెద్దవూర లేదా తిరుమలగిరి

లీఫ్స్ సంస్థ యాచారంలో చేపట్టిన ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆకర్షితులయ్యారు. తన కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని జానారెడ్డి కోరినట్లు తెలిసింది. అవసరమైతే ఖర్చులు కూడా భరించడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. అందుకే ఈ ప్రాంతంలోనే అన్ని రకాల సమస్యలు, పరిష్కార మార్గాలను గుర్తించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో నల్లగొండ జిల్లా నాగార్జున్ సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర లేదా తిరుమలగిరి మండలాల్లో ఏదో ఒక దాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసే అవకాశమున్నది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.

అధికారుల దృష్టికి వెళ్లని అనేక సమస్యలు

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువ. లెక్కలేనన్ని క్రయవిక్రయాలు చోటు చేసుకున్నాయి. అందుకే భూ సమస్యలు కూడా అధికం. సర్వే నంబర్లల్లో విస్తీర్ణం హెచ్చు తగ్గులు, రికార్డుల్లోని సర్వే నంబర్లకు, రైతుల పొషెషన్ కు మధ్య అంతు లేని అగాథం ఉంది. ఈ మండలంలోని పది గ్రామాల్లో ధరణి మాడ్యూళ్ల ద్వారా సమస్యలపై 900 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ మండలంలో లీఫ్స్ సంస్థ భూ సమస్యలపై స్టడీ చేసి, సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నప్పుడు 2200 అప్లికేషన్లు వచ్చాయి. అంటే ప్రభుత్వం దృష్టికి వెళ్లని అనేక భూ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ మండలంలోని పది గ్రామాల్లో భూ సమస్యలుపై లీఫ్స్ స్టడీ చేసింది. 15 రోజుల పాటు సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు అక్కడే మకాం వేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకున్నారు. దీనికి ప్రత్యేక ఫార్మాట్ ను రూపొందించారు. రైతులకు అప్లికేషన్ ఫారాలను అందించారు. వాటిలో పాసు పుస్తకం, సర్వే నంబరు, సమస్య పేర్కొంటే సరిపోయే ఈజీ మెథడ్ ని అనుసరించారు. సమస్యలను 12 కేటగిరీలుగా విభజించారు. వాటన్నింటినీ క్రోడీకరించి పరిష్కార మార్గాలను భూమి సునీల్ ఆధ్వర్యంలోని టీమ్ రిపోర్ట్ రూపంలో తయారు చేసింది. ఒక్కో అప్లికేషన్ ను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి పొరపాట్లు, సమస్యలు, పరిష్కార మార్గాలను న్యాయవాదులు రూపొందించారు.

స్టడీలో గుర్తించిన సమస్యలు

– అసైన్డ్ పట్టాలు ఉన్నా కొత్త పాసు పుస్తకాలు జారీ కాలేదు.

– భూదాన్, వక్ఫ్, సీలింగ్, దేవాదాయ భూములంటూ పట్టా ల్యాండ్స్ ని పీవోబీలో నమోదు చేశారు.

– ధరణి పోర్టల్ లో రైతుల పేరిట ఉండాల్సిన భూమి కంటే తక్కువ విస్తీర్ణం నమోదైన కేసులు అధికం. కొన్ని సర్వే నంబర్లు కూడా మిస్ అయ్యాయి.

– సాదాబైనామా కింద కొనుగోలు చేసిన రైతులు ఉన్నారు.

– 15 రకాల సమస్యలను గుర్తించారు.

గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరిస్తే..

భూ సమస్యలను ప్రతి రైతు గుర్తించలేడు. ఎవరైతే క్రయ విక్రయాలకు వెళ్దామనుకున్నారో, వారు మాత్రమే సమస్య ఉందని గుర్తించి పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే భూ సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలంటే ఇంటింటికీ వెళ్లి వారి భూ రికార్డులను పరిశీలించాలి. వారి దగ్గరున్న డాక్యుమెంట్లకు, రెవెన్యూ రికార్డులకు మధ్య ఎంత తేడా ఉన్నదో చూడాలి. ఆ సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలను చూపాలి. ప్రతి ఇంటికీ వైద్య పరీక్షల మాదిరిగా రెవెన్యూ రికార్డుల పరీక్షలు చేపట్టడం ద్వారా సమస్యల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని భూమి సునీల్ ప్రభుత్వానికి వివరించారు.

Advertisement

Next Story