పేదలతో కలిసి నేతలు, అధికారులు భోజనం చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by M.Rajitha |
పేదలతో కలిసి నేతలు, అధికారులు భోజనం చేయాలి :  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రేషన్ దుకాణాలకు సన్న బియ్యం రవాణా, పంపిణీని వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన ఆహార భద్రత రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనను త్వరగా పూర్తిచేయాలన్నారు. ముఖ్యంగా పేద వారితో కలిసి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు భోజనం చేయాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి సన్న బియ్యం సరఫరాపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రీసైక్లింగ్ ద్వారా కోళ్ల ఫారాలకు, ఇతర అవసరాలకు తరలించవద్దని మంత్రి సూచించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేశారని, దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని 84 శాతం జనాభాకు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందన్నారు. రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా రవాణాను వేగవంతం చేయాలని మంత్రి

ఈ సందర్బంగా అధికారులకు సూచించారు. రేషన్​బియ్యం రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి, సన్న బియ్యం రవాణాపై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తోన్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు. 13 వేల కోట్లు ఖర్చు చేసి, 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ఆహార భద్రత కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ఈ మేరకు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభించామని, దీనికి కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ దుకాణాల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగిపోతున్నందున బియ్యం రవాణాను వేగవంతం చేయాలని, రేషన్ దుకాణాల వద్ద అవసరమైన మేరకు బియ్యం అందుబాటులో ఉండాలని సూచించారు. సంచుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వం చిత్తశుద్ధి చాటేలా విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, సివిల్ సప్లై మేనేజర్ శ్రీనివాస్, అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి రోజా రాణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed