- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాస్ట్టాస్క్...బీ అలర్ట్! పోలీసు ఉన్నతాధికారుల కీలక ఆదేశాలు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : లాస్ట్టాస్క్...బీ అలర్ట్.. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆయా కౌంటింగ్ సెంటర్ల వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అందిన సూచనలివి. పోలింగ్ రోజున శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసిన సిబ్బందిని అభినందించిన అధికారులు కౌంటింగ్ రోజు అదే స్పూర్తిని ప్రదర్శించాలంటున్నారు. చిన్నపాటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఇన్నాళ్లూ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఈసారి హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. దీని కోసం రాష్ట్రానికి చెందిన 45వేల మంది పోలీసులతో పాటు మరో 45వేల కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. వీరికి అదనంగా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 20వేల మందికి పైగా హోంగార్డుల సేవలను కూడా వినియోగించుకున్నారు. ఈ చర్యలు ఫలించి చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక, ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా కట్టుదిట్టమైన పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రం మొత్తం మీద 49 సెంటర్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇందులో 15 కౌంటింగ్ సెంటర్లు ఒక్క హైదరాబాద్లోనే ఉన్నాయి. ఓట్ల లెక్కింపు రోజున ఆయా కౌంటింగ్ సెంటర్ల వద్ద వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఆయా పక్షాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడటం ఖాయం. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల లోపలికి ఆయా పార్టీల అభ్యర్థులు, అనుమతి ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. మిగిలిన వారు కౌంటింగ్ కేంద్రాలకు దూరంగా ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో పాటు ఆయా జిల్లాల ఎస్పీలు, ఇతర కమిషనరేట్ల కమిషనర్లు కౌంటింగ్ సెంటర్లను సందర్శించి అక్కడ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.