అంత తొందరెందుకు.. సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ

by GSrikanth |
అంత తొందరెందుకు.. సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీవో 111కు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుందని, జీవో ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం తొందరపడకూడదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఎలాంటి పరిమితులు లేకుండా జీవో 111ను ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, దీనిపై పర్యావరణవేత్తలు, ప్రజలలో తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిధిలోనున్న లక్షల ఎకరాల పరివాహక ప్రాంతాల్లో భూగర్భజలాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఈ జీవో ఎత్తివేత ద్వారా ఉన్నదని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ జంట జలాశయాలు రంగారెడ్డి జిల్లాలోని అనేక ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీటిని, హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తున్నాయని వెల్లడించారు.

అక్కడ నిర్మాణాలు చేపట్టితే ఆ జలశాయాలు మురుగు నీటితో కలుషితం అయ్యే ప్రమాదం ఉన్నదని సూచించారు. ఈ జలశయాలను కాళేశ్వరం ఎత్తిపోతల నీటితో నింపుతామని ప్రభుత్వం చెబుతున్నదని, సహజసిద్ధమైన పరివాహక జలాలతో కాకుండా ఇలా ఎత్తిపోయడం ద్వారా ఆ జలాశయాలు సహజసిద్ధతత్వాన్ని, పర్యావరన సమతుల్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే దీనివెనుక రాజకీయనాయకులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. కావున జీవో ఎత్తివేతపై నిపుణులు, పర్యావరణ వేత్తలు, రాజకీయ పార్టీ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు స్వీకరించాలని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story