‘అప్పుడు సీన్ వేరేలా ఉండేది’.. వైసీపీ ఓటమిపై KTR సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
‘అప్పుడు సీన్ వేరేలా ఉండేది’.. వైసీపీ ఓటమిపై KTR సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగిన వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో వైసీపీ ఓటమిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌ను ఓడించేందుకు ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను ప్రతిపక్షాలు పావుగా వాడుకున్నాయని అన్నారు. షర్మిల వల్ల వైసీపీకి కొంత డ్యామేజ్ జరిగిందని.. అంతకుమించి ఆమె చేసిందేమి లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఐదేళ్లలో ప్రజలకు సంక్షేమం చేసిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. కేవలం 11 స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించినప్పటికీ.. 40 శాతం ఓటింగ్ పర్సంటేజ్ సాధించడం గొప్ప విషయమన్నారు. నిత్యం ప్రజల్లో తిరిగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎన్నికల్లో ఓడిపోడం కూడా తనను షాక్‌కి గురి చేసిందని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే.. ఏపీ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని కేసీఆర్, కేటీఆర్ పలుమార్లు జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. కానీ కేసీఆర్, కేటీఆర్ అంచనాలు తప్పి.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed