New Laws: కొత్త న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరేంటి?

by Mahesh |
New Laws: కొత్త న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరేంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలపైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం ఓపెన్ లెటర్ రాశారు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ.. ఉద్యమాల అడ్డ అన్నారు. పౌర హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే స్వభావం ఉన్న నేల ఇది అని, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉక్కు పిడికిళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని, అలాంటి తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటీవల కేంద్రం తెచ్చిన చట్టాలతో అలజడి రేగుతోందన్నారు. దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పై అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐసీసీ), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్పీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఏఏ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ) అమలులోకి వచ్చాయని, వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధలను, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని హక్కుల, సంఘాల ప్రజా మేధావులు అభిప్రాయం పడుతున్నారన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసనలు, ఉద్యమాలు చేసే ప్రజలకు ప్రతికూలంగా కొత్త చట్టాలు ఉన్నాయన్నారు. పోలీసులకు ప్రభుత్వానికి మితి మీరిన అధికారాన్ని కట్టబెడుతున్నాయని సామాజిక ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజా స్వామికవాదులు, న్యాయ నిపుణులు మాత్రమే కాదని పలు రాష్ట్రాలు కూడా నూతన చట్టాలను వ్యతిరేకిస్తున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారని, తెలంగాణ ప్రభుత్వంతో పాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పలేదని, రేవంత్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలైయ్యాయని, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు ఈ చట్టాల అమలు నిలిపి వేయాలని సుప్రీం కోర్టులో కేసు వేశారన్నారు. ఈ చట్టాలలోని పలు నిబంధనలు, సెక్షన్‌లు ప్రజల హక్కులను, స్వేచ్చను హరించేలా ఉన్నాయన్నారు. ఈ చట్టాలతో పోలీసులకు, ప్రభుత్వానికి విపరీతమైన అధికారాలు వస్తాయన్నారు. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తెలంగాణ గడ్డ పై నిరంకుశ, నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను యధాతధంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా..? లేక ఇతర రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా అనే విషయాన్ని ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నూతన చట్టాల్లో పేర్కొన్న సెక్షన్లతో రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందన్నారు.

నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్రానికి వెంటనే లేఖ రాయాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. ప్రజలను పౌరులను అణిచివేసే చట్టాలపైన అందులోని సెక్షన్ల పైన రాష్ట్ర పరిధిలో ఉన్న చట్టపరమైన పరిధి మేరకు ఒక కమిటీని వెంటనే నియమించి ఈ చట్టాల పైన తీసుకోవాల్సిన అంశాల పైన చర్చించాలన్నారు. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గా పరిగణిస్తారని గుర్తుంచుకోవాలన్నారు.



Next Story