KTR: సీఎం రేవంత్ .. వాడో పిచ్చోడు.. కొడంగల్ నుంచే ఆయన భరతం పడతాం

by Shiva |
KTR: సీఎం రేవంత్ .. వాడో పిచ్చోడు.. కొడంగల్ నుంచే ఆయన భరతం పడతాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి భరతం పట్టే పనిని కొండగల్ నుంచే మొదలు పెడతాం.. మా పార్టీ వాళ్లందరం కొడంగల్ వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ విధానాల వలనే లగచర్ల ఘటన జరిగిందన్నారు. సీఎంకి రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగ్‌ల ఫార్మూలా మాత్రమే తెలుసు అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్.. వాడో పిచ్చోడు.. ఫార్ములా వన్ ఈ రేసు గురించి ఆయనకేం తెలుసని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిఘా వ్యవస్థ వైఫల్యం వలనే లగచర్ల ఘటన.. కలెక్టర్ గన్‌మెన్లు ఎక్కడ? అని ప్రశ్నించారు. ఫార్మా స్యూటికల్స్, లైఫ్ సైన్సెన్స్ రంగంలో హైదరాబాద్‌లో ఐడీపీఎల్‌ను అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయన్నారు. ఐడీపీఎల్ సంస్థ ఎంతో మందికి గొప్ప వాళ్లను తయారు చేసిందన్నారు. 40 శాతం భారత్లో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి హైదరాబాద్‌లోనే జరుగుతుందని వెల్లడించారు. హైదరాబాద్ ఫార్మా స్యూటికల్ రంగంలో లీడర్‌గా తయారైందని, దాన్ని మరింత పెంచాలని కేసీఆర్ నిర్ణయించారన్నారు. అదే‌విధంగా తెలంగాణను ఫార్మా రంగంలో రారాజు చేసేందుకు కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఫార్మా సిటీ ప్లాన్ చేశారని తెలిపారు.

ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెట్టి అక్కడ నివాసాలు రాకుండా 50 ఏళ్ల పాటు ఎలాంటి సమస్య లేకుండా ఫార్మా సిటీని డిజైన్ చేశారన్నారు. దాదాపు 8 ఏళ్లు కష్టపడి దాదాపు 14 వేల ఎకరాలను మేము సేకరించామన్నారు. అప్పుడు ఇదే రేవంత్‌రెడ్డి ఫార్మా సిటీ వస్తే మీ ప్రాంతం కాలుష్యం అవుతుందని వాళ్లను రెచ్చగొట్టారని గుర్తు చేశారు. కానీ, రేవంత్ రెడ్డి సీఎం అవ్వగానే తుగ్లక్ మాదిరిగా ఏం తెలుసుకోకుండా ఫార్మా సిటీ రద్దు అనడంతో రైతులు ఆశపడ్డారన్నారు. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఫార్మా సిటీ రద్దు కాదు.. మళ్లీ మేము ఫార్మా విలేజ్ పెడతామని చెప్పారన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ఫార్మా సిటీ పేరును ఫార్మా విలేజ్‌గా మార్చారని ఆరోపించారు. నాడు భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు. అలాంటి ఫార్మా సిటీని వదిలి.. సీఎం మూర్ఖ నిర్ణయాలు తీసుకున్నాడని, దాని కారణంగానే ప్రజలు తిరగబడుతున్నారని, ప్రజల తిరుగుబాటులో ఎవరి కుట్ర లేదన్నారు. కొడంగల్‌లో ఫార్మా విలేజ్ విషయంలో ఆరు నెలల నుంచే ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సీఎం సోదరుడు తన్ని తీసుకుంటామని రైతులను బెదిరించిన ఆడియో తమ వద్ద ఉందని వెల్లడించారు.

ఫార్మా విలేజ్ వద్దని కొడంగల్ రైతులు సీఎంను, మమ్మల్ని, బీజేపీ వాళ్లను కూడా కలిశారని తెలిపారు. కొడంగల్ రగలడానికి రేవంత్‌రెడ్డి ఆనాలోచిత నిర్ణయాలే కారణమని అన్నారు. సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్ట్ అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లాడని దుయ్యబట్టారు. జాతీయ కాంగ్రెస్ నేతలకు తాబేదారుగా వ్యవహరిస్తూ ఇక్కడ పాలన గాలికి వదిలేశాడన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదు కిడ్నాప్ చేశారని, ఆయనేమైనా బందిపోటా.. అని నిలదీశారు. భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, పేద బీసీ ల భూములను రేవంత్ రెడ్డి తన అనుచరులు, కుటుంబ సభ్యులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రైతులను అర్ధరాత్రి అరెస్ట్ చేశారని.. ఇది పేదలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఇదని అన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడుకు చెందిన మ్యాక్స్ బీఎన్ కంపెనీ విస్తరణ కోసమే రైతుల భూములను తీసుకుంటున్నారు.. అన్నం శరత్ మెడికవర్ హాస్పిటల్ ఓనర్, ఆయన అల్లుడు, రేవంత్ రెడ్డి అల్లుడు ఇద్దరు ఒకే సంస్థలో డైరెక్టర్లు.. వాళ్ల ఇద్దరి కోసమే ఫార్మా విలేజ్ పేరుతో అక్రమాలు చేసేందుకు సీఎం కుట్ర చేశాడని ఆరోపించారు. బెంగళూరులోనూ మెడికవర్ హాస్పిటల్‌ను అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారని గుర్తు చేశారు. నేను ఢిల్లీకి వెళ్లింది అనుముల కుటుంబ కుంభకోణాలు బయటపెట్టేందుకు వెళ్లామని, మళ్లీ కూడా కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

కొడంగల్‌లో సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త 7 ఎకరాల భూమి పోతోంది.. విలువైన భూమి పోతదంటే అడగటం తప్పా? అని ప్రశ్నించారు. కలెక్టర్ అభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు రైతుల బాధలను ఆయనకు చెప్పాడు.. ఎక్కడ కూడా దాడి చేయలేదు.. సురేష్ దాడికి పాల్పడినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మా పార్టీ నాయకులు మా వారితో మాట్లాడితే అది కూడా తప్పా.. దానికి కేసులు పెడతారా? ప్రశ్నించే గొంతుక అనే కదా నువ్వు కూడా గెలిచింది.. మరీ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించే వాళ్లను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. నీ ఆనాలోచిత విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అన్నారు. సురేష్ నాతో వచ్చి కలవటమే తప్పు అయితే రాహుల్ గాంధీ వ్యతిరేకించే అదానీతో రేవంత్‌రెడ్డి రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు.. మరి దానికి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించాలి కదా.. అని నిలదీశారు. మీ ఆనాలోచిత నిర్ణయాలను మానుకోవాలని, ఫార్మా విలేజ్‌ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఫార్మా సిటీ పేరుతో ఫోర్త్ సిటీ, స్కిల్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారన్నారు. అవసరం లేని చోట కూడా భూములు కొని రోడ్లు వేస్తూ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టులో ఈ దుర్మార్గాలపై పోరాటం చేస్తాం.. రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన రైతులు నడవలేకపోతున్నారు.. వాళ్లను పోలీసులు కొట్టారు.. వాళ్లను చిత్రహింసలు పెడుతున్నారు.. వాళ్లకు మెడికల్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉందన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కంపెనీల బాగోతాన్ని ధారావాహిక మాదిరిగా బయటపెడుతూనే ఉంటామని వెల్లడించారు. ఫార్మా విలేజ్ పేరుతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసే నిర్ణయాన్ని మానుకోండి అని సూచించారు. ఫార్మా సిటీ కోసం రైతులు ఇచ్చిన భూమిని వారికి తిరిగి ఇస్తామని మాటిచ్చారు.. ఎప్పుడు ఇస్తారో తేదీ చెప్పండి అని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed