- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: జీపీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్‌ల బంద్ మూర్ఖపు చర్య.. సర్కార్‌పై మండిపడ్డ కేటీఆర్
దిశ,వెబ్‌డెస్క్: హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోని గ్రామ పంచాయితీ లేఅవుట్లలో వెలిసిన వెంచర్లలో రిజిస్ట్రేషన్లు బంద్ చేస్తూ తెలంగాణ (Telangana) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా మూర్ఖపు చర్యేనని మండిపడ్డారు. ఏమాత్రం పేదలు, మధ్య తరగతి ప్రజల గురించి ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని, పరిపాలన అనుభవం లేకుండా తుగ్లక్‌ను తలపించేలా రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో పేద ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ రోజు (శనివారం) ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మొన్నటి వరకు హైడ్రా, మూసీ పేరుతో పేదల గూడు కూల్చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తాజాగా హెచ్ఎండీ పరిధిలో ఉన్న పేదలు, మధ్య తరగతిని టార్గెట్ చేశారన్నారు. వాళ్ల ఇళ్లు కూల్చేసింది చాలదన్నట్లుగా ఇప్పుడు ప్లాట్లపై కూడా పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసేందుకే ఇలాంటి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
‘‘హెచ్ఏండీఏ పరిధిలో ఉన్న జీపీ లేఅవుట్లలో వేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుక్కోవటం ప్రజల తప్పా? ఎన్నికల ముందు ప్లాట్లకు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా..? ఎన్నో ఏళ్లుగా ఆ ప్లాట్లు ఎంతో మంది చేతులు మారాయని.. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు, ఇక మళ్లీ రిజిస్ట్రేషన్ చేయమంటే వాళ్ల పరిస్థితి ఏమవుతుంది? ప్రభుత్వమంటే ఏళ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. ఇన్నేళ్లుగా లేని సమస్యలను సృష్టించడం దారుణం. రేవంత్ రెడ్డి చేస్తున్న తుగ్లక్ పనులకు పేద, మధ్య తరగతి ప్రజలే సమిధలవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో వేలాదిగా జీపీల్లో లేఅవుట్లు వెలిశాయి. వాటి క్రయ విక్రయాలు కూడా ఎంతో మంది చేతులు మారాయి. ఇప్పుడు వాటికి ఎవరిని బాధ్యులు చేస్తారు? భవిష్యత్ కోసం, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం పైసా, పైసా కూడబెట్టుకొని పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఇప్పుడు చెల్లవంటే వారి పరిస్థితి ఏం కావాలో చెప్పండి. రెండు, మూడు దశాబ్దాల క్రితం తమ తాతాలు, తండ్రులు కొన్న ప్లాట్లను ఇప్పుడు చెల్లవన్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాళ్లు ఎవరికీ చెప్పుకోవాలి?’’ అంటూ సదరు ప్రకటనలో కేటీఆర్ నిప్పులు చెరిగారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బిల్డర్లను బెదిరిస్తూ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని, ఇప్పుడు వెంచర్ల యాజమానుల నుంచి కూడా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసేందుకే ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూళ్ల పేరుతో పేదలు, మధ్య తరగతి ప్రజలను రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడని, జీపీ లేఅవుట్లలో గతంలో కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయటమంటే పేద, మధ్య తరగతి ప్రజల ఆస్తులను ప్రభుత్వం లాక్కోవటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని అన్నారు. ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ ఫ్రీ గా చేస్తామంటూ నమ్మబలికి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టిన వాళ్లను కూడా ఆగం చేసే పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు. వెంటనే ఎన్నికల నాటి హామీ ప్రకారం పూర్తిగా ఎల్ఆర్ఎస్ ఫీజును రద్దు చేసి.. గ్రామ పంచాయితీ లేఅవుట్ల వెంచర్లలో రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే బాధిత ప్రజలతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.