‘అది ఒట్టి పుకారే’.. ఎంపీ ఒవైసీ వ్యాఖ్యలకు క్రిశాంక్ స్ట్రాంగ్ కౌంటర్

by Satheesh |   ( Updated:2024-07-17 09:00:21.0  )
‘అది ఒట్టి పుకారే’.. ఎంపీ ఒవైసీ వ్యాఖ్యలకు క్రిశాంక్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందన్న వార్తలపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రిశాంక్ మాట్లాడుతూ.. బీజేపీతో సంప్రదింపుల కోసం కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారనే తప్పుడు వార్తలపై ఒవైసీ వివరణ కోరడంలో అర్థం లేదని అన్నారు. సుప్రీం కోర్టులో కేసుల విషయమై చర్చించేందుకే కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీ వెళ్లారు తప్ప అందులో ఎలాంటి రాజకీయాలు లేవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కుపై ఒవైసీ మాట్లాడాలని హితవు పలికారు. జస్టిస్ నరసింహ రెడ్డికి ఆర్ఎస్‌ఎస్ మూలాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమేనని.. మరీ నరసింహ రెడ్డిని పవర్ విచారణ కమిషన్ చైర్మన్‌గా నియమించడంపై అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

బీజేపీతో సంబంధాలపై కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎన్నో రోజులుగా చేసిన ఆరోపణలే మళ్ళీ చేస్తోందని, బీజేపీ కూడా కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ కుమ్మక్కు అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు అయితే కవిత జైలుకు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు అనేది వట్టి పుకారేనని కొట్టి పారేశారు. బీజేపీలో విలీనంపై ఆన్సర్ ఇవ్వడానికి ఒవైసీకి కేసీఆర్ జవాబుదారీ కాదని కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మకైతే ఇండియా కూటమి పక్షాలు శివసేన, సమాజ్ వాదీ పార్టీ కవిత అరెస్టును ఎందుకు ఖండిస్తాయని ప్రశ్నించారు. అనవసర పుకార్లకు మీడియా ప్రాధాన్యత ఇవ్వొద్దని, ఒవైసీ మీడియాలో వచ్చిన పుకార్ల ఆధారంగా బీఆర్ఎస్‌ను వివరణ కోరడం భావ్యం కాదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed