తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-01 10:46:35.0  )
తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈనెల 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా మొత్తం ఆలయాన్ని, దేవతా మూర్తులను, పూజా సామగ్రిని శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణంలోని గోడలు, పైకప్పులు, స్తంభాలు అన్నింటిలోనూ పరిమళం అనే ప్రత్యేక సుగంధ మిశ్రమాన్ని పూశారు. అనంతరం పీఠాధిపతికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె. శ్యామలరావు మాట్లాడుతూ అక్టోబరు 4 నుంచి 12 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ విశిష్ట తిరుమంజనం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. సాధారణంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సంవత్సరానికి నాలుగుసార్లు నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాల ముందు సంవత్సరం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, వీఐపీ బ్రేక్‌ను టీటీడీ రద్దు చేసింది.

Advertisement

Next Story