ప్రజలకు జవాబుదారితనంగా పని చేయాలి

by Sridhar Babu |   ( Updated:2024-01-23 14:05:57.0  )
ప్రజలకు జవాబుదారితనంగా పని చేయాలి
X

దిశ, వైరా : ప్రజలకు జవాబుదారితనంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్ర సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి అధికారుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా రాందాస్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. తమ దృష్టికి వచ్చే ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. తమ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్యం దృష్టికి తీసుకు రావాలని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు

ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వివరించారు. ఆరు గ్యారెంటీల లబ్దిదారుల ఎంపికను, పథకాల అమలును పారదర్శకంగా అమలు చేయాలన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయకుంటే ఉపేక్షించమని స్పష్టం చేశారు. ప్రధానంగా నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వైరా నియోజకవర్గంలోని ఏజెన్సీ మండలాలైన ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి లోని విద్యుత్ సౌకర్యాలు లేని గ్రామాలకు వెంటనే విద్యుత్ సరఫరాను చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఏజెన్సీ గ్రామాల్లో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై చర్చ.....

వైరా నియోజకవర్గంలో రైతులు సాగు చేస్తున్న పంటలకు 24 గంటల విద్యుత్ సరఫరా పై సమీక్ష సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. కొణిజర్ల మండల విద్యుత్ సమస్యలపై ఏఈ తో ఎమ్మెల్యే చర్చించే సమయంలో అంజనాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చల్లగుండ్ల సురేష్ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేయటం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పగలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా జరగటం లేదని ఆరోపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొణిజర్ల ఏఈ కనీసం ఫోన్ ఎత్తరని ఆయన ఆరోపించారు.

అదే సమయంలో కౌన్సిలర్ గుడిపూడి సురేష్ మాట్లాడుతూ పగలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కాకపోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పొలాల్లో పని చేసుకునే రైతులు పురుగు మందు పిచికారీ తో పాటు ఇతర అవసరాలకు ఇళ్ల వద్ద నుంచే నీళ్లు తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైరా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ దొడ్డా పుల్లయ్య మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా జరగటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి ఈ రెండు నెలల కాలం సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఐసీడీఎస్ పై చర్చ జరిగే సమయంలో కొణిజర్ల మండల కాంగ్రెస్ నాయకులు వడ్డే నారాయణరావు అంగన్వాడీ కేంద్రాలకు

కాంట్రాక్టర్ గుడ్లు సక్రమంగా సరఫరా చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొరగా సరఫరా చేసే గుడ్లు చిన్నవిగా ఉంటున్నాయని, మురిగిపోతున్నాయని ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అదే సమయంలో కొణిజర్ల కాంగ్రెస్ నాయకులు కోసూరి శ్రీను మాట్లాడుతూ అంగన్వాడీ ఉపాధ్యాయురాళ్లకు ఎగ్స్ సప్లై కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ పై జరిగిన చర్చలో వచ్చే రెండు నెలల పాటు వైరా రిజర్వాయర్ ఆయకట్టులో రైతులు సాగు చేస్తున్న పంటలకు రెండు తడులు నీళ్లు ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మార్కుఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, దాసరి దానియేలు, వైరా ఏసీపీ రెహమాన్ తో పాటు నియోజకవర్గ పరిధిలోని డీఈలు, ఏఈ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More..

డబ్బులు దాచేందుకు అదే సేఫ్ ప్లేస్.. వృద్ధురాలి తెలివికి పోలీసుల మైండ్ బ్లాంక్

Advertisement

Next Story

Most Viewed