ఆ కీచక ఉద్యోగి సస్పెండ్ అయ్యేనా..

by Sumithra |
ఆ కీచక ఉద్యోగి సస్పెండ్ అయ్యేనా..
X

దిశ, మయూరి సెంటర్ : ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలలో నాలుగవ తరగతి స్థాయి నుండి గెజిటెడ్ స్థాయి వరకు మహిళా ఉద్యోగులు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటుగా అనేక మంది పురుష ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న కొందరు మహిళలు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు వివిధ స్థాయిలలో పనిచేస్తున్న అనేక మంది పురుష ఉద్యోగులు కిందిస్థాయి మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు అత్యంత విశ్వాసనీయ సమాచారం. కొందరు మహిళ ఉద్యోగినీలు ఎవరికి చెప్పుకుంటే ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని భయపడి తోటి మహిళ ఉద్యోగులతో చెప్పుకుంటూ తన గోడును వెళ్లబుచ్చుకుంటున్నారు.

ఒకరిద్దరు మహిళ ఉద్యోగులు ధైర్యం చేసి ఆ శాఖలో ముఖ్య అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే, విచారణ చేసి మెమో ఇచ్చి, ఆ కీచక ఉద్యోగిని వివరణ కోరినట్లు తెలుస్తుంది. ఇదంతా ఖమ్మం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సమీకృత నూతన కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుండడం కొసమెరుపు. మరికొందరు పురుష ఉద్యోగులు ఫంక్షన్ల, పెళ్లిళ్ల, ఉప్పలమ్మలు పేరిట మధ్యాహ్నం బయటికి వెళ్లి మద్యం సేవించి మళ్లీ విధులకు హాజరవుతున్నట్లు వాపోతున్నారు. ఇలా తప్పతాగి విధులకు హాజరవుతున్న పురుష ఉద్యోగులను చూసి మహిళా ఉద్యోగులు భయపడుతున్నారు. ఇలా మానసిక, శారీరక, వేధింపులకు గురవుతున్న మహిళా ఉద్యోగులు ఏ సమయంలో ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.

మహిళా ఉద్యోగి పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉన్న, కనీస రక్షణ కరువైందని మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగ బాధ్యత నిర్వహించే క్రమంలో పై అధికారులకు అనుకూలంగా లేకపోతే అధిక పనిఒత్తిడితో తన దారిలోకి తీసుకొచ్చినట్లు కూడా కొంతమంది అధికారుల పై బహిరంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ శాఖలను కలిపి ప్రత్యేక ఫిర్యాదు సెల్ ఏర్పాటు చేసి, రక్షణ కల్పించాలని, మహిళా ఉద్యోగులను వేధిస్తున్న కీచక ఉద్యోగులను సస్పెండ్ చేసి, విచారణ చేయాలని పలువురు ఉద్యోగినిలు కోరుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed