కొత్తగూడెంలో కలియుగ వామనుడు

by Shiva |   ( Updated:2023-02-12 12:50:27.0  )
కొత్తగూడెంలో కలియుగ వామనుడు
X

బినామీల పేర్లతో విచ్చలవిడిగా భూదందా

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: వడ్డించే వాడు మన వాడైతే బంతిలో ఏ మూల కూర్చున్న విందు భోజనమే అన్న చందంగా తయారైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అక్రమ రియాల్టర్ల పరిస్థితి. గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అడ్డదారిన సంపాదనకు తెగబడుతున్నారు బడాబాబులు. అడుగు స్థలం తనదైతే ఆరడుగులు కబ్జా చేస్తూ కలియుగ వామనావతారంలో తిరుగుతున్నారు. తాజాగా వచ్చిన సినిమా పాటలో లిరిక్ లాగా ఆ పక్క నాదే.. ఈ పక్క నాదే ఆనుకొని ఉన్న చెరువు స్థలం మొక్క నాదే అంటున్నాడు ఒక విద్యా సంస్థల అధినేత.

బినామీల పేర్లతో భూదందాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన చట్టమైన 1/70 అమలులో ఉంది.ఈ చట్ట ప్రకారం గిరిజనేతరులు భూమి కొనుగోలు అమ్మకాలకు అనర్హులు. ఒకవేళ కొనుగోలు చేసినా అమ్మకాలు జరిపిన చట్ట విరుద్ధంగా పరిగణిస్తారు. భూమి కొనుగోలు చేసిన గిరిజనేతరులకు భూమిపై ఎటువంటి హక్కు ఉండదు. చట్టాలను అవపోసన పట్టిన కొంతమంది రియల్ కేటుగాళ్లు బినామీల పేర్లతో భూములను కొనుగోలు చేసి అనుమతులు లేకున్నా వెంచర్లు వేసి యథేచ్ఛగా అమ్మకాలను సాగిస్తున్నారు.

కొత్తగూడెం జిల్లా కేంద్రం కావడంతో అభివృద్ధి ఉరకలు వేస్తున్న తరుణంలో కొనుగోలుదారులకు అరచేతిలో అరుంధతి నక్షత్రాలు చూపి భూములను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుపడ్డ వారికి అన్ని అనుమతులున్నాయి అంటూ బినామీల పేర్లతో ఉన్న పత్రాలను చూపుతూ తప్పుతోవ పట్టిస్తున్నారు. అమాయక గిరిజనులకు డబ్బు ఆశ చూపడుతూ రూ.కోట్లు విలువ చేసే భూములను వారే కొనుగోలు చేసినట్లు, ప్రభుత్వ వివాదాస్పద భూములను గిరిజనులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపుతూ రూ.కోట్లు విలువ చేసే భూములను కొల్లగొడుతున్నారు.

చదును చేస్తూనే చెరువును మింగారు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ పంచాయతీ లో సుమారు 23 ఎకరాల అనుమతులు లేని వెంచర్ను ఏర్పాటు చేశారు ఓ విద్యాసంస్థల అధినేత. వెంచర్ కు కావలసిన అనుమతులన్నాయి అంటూ హడావుడి చేస్తూ భూమిని చదును చేశారు. బినామీల పేర్లతో తీసుకున్న భూమి సరిపోలేదన్నట్లు దశాబ్దాల చరిత్ర ఉన్న చెరువును సైతం వందల లారీల మట్టితో పూడ్చి చెరువుని మాయం చేశారు. అదే ప్రాంతంలో ఉన్న మరో కొంత ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ఈ వెంచర్ కు సంబంధించి రెవెన్యూ అధికారులు ల్యాండ్ కన్వర్షన్ డీటీసీపీ అప్రూవల్ ఇచ్చినట్లు ప్రచారం చేస్తూ భారీ వెంచర్ కి రూపకల్పన చేశారు. అసలు బినామీ పేరుతో కొనుగోలు చేసిన భూమి ఎంత? అనుమతులు పొందింది ఎంత? రియల్ వ్యాపారం చేస్తున్న భూమి విస్తీర్ణం ఎంత అన్న అంశంపై ఏ అధికారులు విచారణ చేపట్టిన దాఖలాలు కనబడటం లేదు.

గతంలో ఉండే చెరువు ఏమైంది రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి ప్రభుత్వానిదా లేదా ప్రైవేటు వ్యక్తులదా?పట్టణానికి కూతవేటు దూరంలో ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆ విద్యా సంస్థల అధినేత మాత్రం చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్లు లేని భూమి ధరలను సృష్టిస్తూ గిరిజనేతరుల నెత్తిపై శఠగోపం పెడుతున్నట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరత్తినట్లు వ్యవహరించడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed