ఆఫీసర్ల మీనమేషాలతో కోట్లకు గండి..

by Sumithra |
ఆఫీసర్ల మీనమేషాలతో కోట్లకు గండి..
X

అక్రమాలకు నిలయంగా మారిన పాల్వంచ తొగ్గూడెం క్వారీ నిర్వాహకుని ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. రాజకీయ నాయకుల జోక్యమా.. అధికారుల ఉదాసీనతో తెలియదు గానీ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీకి కోట్లలో గండి కొడుతున్నా అడ్డుకునేవారే లేకుండా పోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిపేయాలని మైనింగ్ శాఖ లేఖలు రాసినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోరు. అనుమతులకు మించి ఖనిజాన్ని తరలిస్తున్నారని జరిమానా కట్టాలని నోటీసులు పంపినా ఖాతరు చెయ్యరు. చివరకు రహదారుల వెంబడి ట్రెంచ్ కొట్టించినా కూడా మరో దారి వెంట కంకరను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతున్నది.

దిశ, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం క్వారీ అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. వివాదాలకు కేంద్ర బిందువైన ఈ క్వారీకి అన్ని అనుమతులున్నాయని బిల్డప్ ఇస్తున్న నిర్వాహకులు.. కాలపరిమితి ముగిసిన పత్రాలతో యథేచ్ఛగా క్వారీ నిర్వహిస్తుండటం, మైనింగ్ పనులు చేస్తుండటం విస్తుగొలుపుతుంది. ఇప్పటివరకు ప్రశ్నించిన స్థానికులను, విలేకరులను బెదిరించిన నిర్వాహకుడు.. అధికారులను లోబరుచుకోవడం పెద్ద పనేమీ కాదనే విమర్శలు వస్తున్నాయి. పైగా క్వారీ నిర్వాహకులను రాజకీయ అండదండలు మెండుగా ఉండటంతోనే ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతుందన్న టాక్ సర్వత్రా వ్యక్తమవుతున్నది. రాజకీయ నాయకులు ఆదేశాల కారణంగానే జిల్లాలోని వివిధ శాఖల అధికారులు క్వారీ నిర్వాహకునిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఆ కారణంగానే వెనుకడుగు వేస్తూ ఇచ్చింది తీసుకుంటూ మిన్నకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

మొదటి నుంచి వివాదాలే..

సంపాదనే ధ్యేయంగా మారిన క్వారీ నిర్వాహకులు ‘మేనేజ్’ చేసే విధానాన్ని బాగా వంట పట్టించుకున్నారు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి వారి సూచనలతో అధికారుల వరకు జిల్లాలో అధికార యంత్రాంగం మొత్తం క్వారీ నిర్వాహకుని విషయంలో ఉదారంగా వ్యవహరించడం విశేషం. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో గండికొడుతున్నా.. ఏ ఒక్క అధికారి స్పందించడు. అక్రమాలకు నిలయంగా మారి అనుమతులు పొందిన ప్రదేశంలో కాకుండా ప్రభుత్వ భూముల్లో, అటవీ భూముల్లో మైనింగ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు అనుమతికి మించి లోడిండ్ చేస్తూ వాహనాలను తరలిస్తున్నా, ప్రజలు, పశువుల ప్రాణాలు పోతున్నా లెక్కచేయకపోవడంతో నిర్వాహకుని ‘మేనేజ్’స్టైల్ ఏంటో అర్థమవుతుంది.

మొత్తం 9 క్వారీలు.. అనుమతులు ఒక్కదానికే..

తొగ్గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 9స్టోన్, మెటల్ క్వారీ లీజులకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. వాటిలో 3 క్వారీలకు లీజులను రద్దు చేశారు. 5 క్వారీల లీజు సమయం ముగిసింది. ఒక్కదానికి మాత్రమే ప్రస్తుతం అనుమతి ఉంది. అయినా క్వారీలన్నీ రన్ అవుతున్నాయి. దీంతో అధికారులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీహెచ్ నాగమ్మ పేరుమీద ఉన్న క్వారీకి 12.05.2022 లో షో కాజ్ నోటీసు జారీ చేసి, 24.06. 2022లో రూ.35 కోట్ల పైచిలుకు చెల్లించాలని డిమాండ్ నోటీసు అందజేశారు. లునావత్ కిషన్ పేరిట ఉన్న క్వారీకి 12.05.2022లో షోకాజ్ నోటీజు జారీ చేసి 21.06.2022న రూ.15.45కోట్లు చెల్లించాలని డిమాండ్ పంపించారు.

వగ్గే వెంకటేశ్వర్ రావు పేరిట ఉన్న క్వారీకి 02.07.2022న షోకాజ్ నోటీసులు అందించిన అధికారులు.. 10.08.2022న రూ.12 కోట్లు చెల్లించాల్సి ఉందని డిమాండ్ నోటీసు పంపిణీ చేశారు. బానోత్ రామయ్య విషయంలో 02.07.2022న షోకాజ్ నోటీసులు జారీ చేసి, 10.08.2022 న రూ.82 కోట్ల పెనాల్టీ విధిస్తూ డిమాండ్ నోటీసు జారీ చేశారు. బోడా చిట్టిబాబు పేరిట ఉన్న క్వారీకి 02.07.2022న షోకాజ్ నోటీసులు జారీ చేసిన అధికారులు.. 10.08.2022న డిమాండ్ నోటీసు పంపించి రూ.43 కోట్లు చెల్లించాలని నోటీసులో పొందుపరిచారు. శెట్టిపల్లి నర్సింహారావు, సోడె సతీష్, ఇస్లావత్ రాజులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన అనంతరం ఒకరికి రూ.10 కోట్లు, మరొకరికి రూ.17 కోట్లు, ఇంకొకరికి రూ.13 కోట్లు పెనాల్టీ విధిస్తూ డిమాండ్ నోటీసులు పంపారు. అయినా వీరిలో ఒక్కరు కూడా డిమాండ్ నోటీసుకు స్పందించలేదు. పైగా వీరి క్వారీలు యథేచ్ఛగా నిర్వహిస్తుండటం గమనార్హం.

అధిక మొత్తంలో మెటల్ తరలింపు..

అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ మొత్తంలో తవ్వకాలు జరిపి స్టోన్, మెటల్ తరలించినట్లు గుర్తించిన అధికారులు.. మొదట షోకాజ్ నోటీసులు, అనంతరం డిమాండ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల ప్రకారం సీనరేజీ, జరిమానా చెల్లించాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయినా నిర్వాహకులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజీ, జరిమానా చెల్లించక పోవడంతో వాహనాల రాకపోకలు నిషేధిస్తూ ట్రెంచ్ కొట్టించారు. కానీ క్వారీ నిర్వహణ, మైనింగ్ పనులు ఏ మాత్రం ఆగకుండా వేరే దారిలో రాత్రిళ్లు కంకర తరలింపును యథేచ్ఛగా నిర్వహించ సాగారు. క్వారీ ప్రారంభం నుంచి ఈ విధమైన ఫిర్యాదులు రావడంతో మైనింగ్ అధికారులు పాల్వంచ తహసీల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లకు 2040/జీసీ/2017, 09.02.2023, 17.03.2023, 11.07.2023, 20.04.2024, 17.08.2024న లేఖలు పంపిస్తూ తోగ్గూడెం క్వారీల నిర్వహణ జరగకుండా చూడాలని, అక్రమంగా తరలిస్తున్న కంకరకు అడ్డుకట్ట వేయాలని, మైనింగ్ పనులను పర్యవేక్షించాలని అందులో స్పష్టంగా కోరారు. అయినా అక్కడి అధికారులు కూడా చేతులెత్తేయడంతో క్వారీల నిర్వహణకు అడ్డే లేకుండా పోయింది.

Advertisement

Next Story