Ferry Accident : సముద్ర తీరంలో విషాదం.. అదుపుతప్పి బోల్తా పడిన పడవ

by vinod kumar |
Ferry Accident : సముద్ర తీరంలో విషాదం.. అదుపుతప్పి బోల్తా పడిన పడవ
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై(Mumbai) సముద్ర తీరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవను ఇండియన్ నేవీకి చెందిన బోటు ఢీకొట్టడంతో ముగ్గురు నేవీ సిబ్బంది సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నీల్ కమల్ (Neel kamal) అనే ఫెర్రీ గేట్ వే ఆఫ్ ఇండియా (gate of india) నుంచి ముంబైకి సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఎలిఫెంటా దీవులకు (Elephanta Islands) వెళ్తోంది. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం బుచర్ ఐలాండ్ (Buchal island) సమీపంలో నేవీకి చెందిన పెట్రోలింగ్ స్పీడ్ బోటు ఫెర్రీని బలంగా ఢీకొట్టింది. అనంతరం వెంటనే సముద్రంలో మునిగి పోయింది. దీంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 10 మంది పౌరులు ఉండగా, మరో ముగ్గురు నేవీ సిబ్బంది ఉన్నారు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే నేవీ, జేఎన్‌పీటీ, కోస్ట్‌గార్డ్‌, పోలీసులు, స్థానిక మత్స్యకారుల బోట్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి 101 మందిని రక్షించారు. వారిలోనూ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో పడవలో సుమారు 110 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ధ్రువీకరించారు. ప్రమాదంలో మరికొంత మంది ఆచూకీ లభ్యం కాలేదని గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు.

సహాయక చర్యల్లో నాలుగు హెలికాప్టర్లు

నాలుగు హెలికాప్టర్లు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని, స్థానిక పోలీసులు, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, ఆ ప్రాంతంలోని మత్స్యకారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని రక్షణ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఇండియన్ నేవీ స్పందించింది. ట్రయల్స్ సమయంలో ఇంజిన్ నియంత్రణ కోల్పోవడంతో స్పీడ్ బోటు ఫెర్రీని ఢీకొట్టగా బోల్తా పడినట్టు తెలిపింది.

సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము

ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Murmu) సంతాపం తెలిపారు. ‘ముంబై సముద్ర తీరం సమీపంలో ప్రయాణీకుల ఫెర్రీబోట్ ప్రమాదానికి గురైనట్లు తెలుసుకుని ఎంతో బాధపడ్డా. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. రెస్క్యూ ఆపరేషన్లు వేగంగా విజయవంతం కావాలని, ప్రాణాలతో బయటపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed