బిగ్ న్యూస్: లింగాల వర్సెస్ బొమ్మెర.. మధిర బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు

by Satheesh |
బిగ్ న్యూస్: లింగాల వర్సెస్ బొమ్మెర.. మధిర బీఆర్ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు
X

మధిర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో వర్గవిభేదాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఆ నియోజకవర్గంపై కన్నేసిన ఇద్దరు నేతల మధ్య నెలకొన్న జగడం సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బయటపడింది. ఇందులో ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కాగా.. మరొకరు మధిర మాజీ ఇన్ చార్జీ బొమ్మెర రాంమూర్తి. వీరిలో లింగాల.. సీఎం కేసీఆర్, ఇతర నాయకులతో ఉండగా.. బొమ్మెర మాత్రం పోలీసుల ఆంక్షల్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందినా.. ఇద్దరూ నియోజకవర్గంలో బలప్రదర్శన చేస్తున్నా ప్రియారిటీలు మాత్రం వేరుగా ఉండటం విశేషం. ఒకరికి స్థానిక నాయకత్వం అండదండలుండగా.. మరొకరు మాత్రం ఉద్యమకారునిగా ముద్ర పడి, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు.

దిశ బ్యూరో, ఖమ్మం: మధిర నియోజకవర్గం బీఆర్ఎస్‌లో ఇప్పడిప్పడే వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ సీటు నాదంటే.. నాదంటూ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మధిర మాజీ ఇన్ చార్జీ బొమ్మెర రాంమూర్తి పోటీ పడుతున్నారు. ఇద్దరూ ఈ నియోజకవర్గంపై ఎప్పటినుంచో కన్నేసినా ఈసారి మాత్రం వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. వీరిద్దరిలో లింగాల కమల్ రాజ్‌కు స్థానిక నాయకత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఒకటి, రెండు సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లింగాలే నని స్పష్టత కూడా ఇచ్చారు నాయకులు. ఇక అప్పటినుంచి బొమ్మెర రాంమూర్తి ఒంటరిపోరాటం చేస్తూ అదే నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. స్థానిక నాయకులు తనను ఆదరించకున్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీ చేస్తానని చెబుతున్నాడు.

నాలుగు సార్లు పోటీచేసి.. ఓటమి పొంది..

లింగాల కమల్ రాజ్ సీపీఎం అభ్యర్థిగా తొలిసారి 2009లో మధిర నియోజకవర్గంలో పోటీచేసి ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం, వైఎస్ఆర్ సీపీ పొత్తులో మళ్లీ బరిలోకి ఓడిపోయాడు. మూడవసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యాడు. 2018లొ బీఆర్ఎస్ నుంచి పోటీచేసి మళ్లీ ఓడిపోయాడు. బీఆర్ఎస్‌కు రాకముందు సీపీఎం అభ్యర్థిగా కమ్యూనిస్టు భావజాలం కలిగిన లింగాల తర్వాత కాలంలో.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పొంగులేటి సహకారంతోనే వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచాడు.

పొంగులేటితో ఉన్నంతకాలం ఆయన ఆధ్వర్యంలో పోటీలో నిలిచిన సమయాల్లో లింగాలకు అయిన ఖర్చంతా పొంగులేటే భరించాడనే ఒక టాక్ కూడా ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా ఉన్నాడంటే అందుకు కారణం పొంగులేటే అన్న అభిప్రాయం లేకపోలేదు. రెండు దశాబ్దాలకు పైగా సీపీఎంలో, కొన్ని సంవత్సరాల పాటు పొంగులేటి వెంట.. ఆ తర్వాత ఇప్పుడు అధికార బీఆర్ఎస్ వెంట నడుస్తున్న కమల్ రాజ్ రానున్న రోజుల్లో ఆ పార్టీలో ఉంటాడా? లేదా అవకాశవాదిలాగా మారుతాడా? అన్న చర్చ కూడా లేకపోలేదు.

అవకాశాలు దక్కని బొమ్మెర

బొమ్మెర రాంమూర్తి 23 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. 14 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించాడు. సమైక్య రాష్ట్రంలో 175 కేసులు నమోదు అయ్యాయి. 12 సార్లు జైలు కు కూడా వెళ్లి వచ్చాడు. రాష్ట్రం ఆవిర్భవించాక తొలిసారిగి మధిర నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి భట్టి విక్రమార్కపై ఓటమి పాలయ్యాడు. తర్వాత అవకాశం రాకపోవడంతో ఉద్యమకారునిగా తిరుగుతూ వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడు.

ప్రస్తుతం మధిర నియోజవర్గంలో స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకుని వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ.. బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళుతున్నాడు. అయితే ఇంతకాలం బీఆర్ఎస్ ను అంటిపెట్టుకున్నా.. ఏ ఒక్క అవకాశం రాకపోవడం..జిల్లాకు చెందిన నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదనే అసహనంలో ఉన్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానానికి లేఖల ద్వారా విన్నవించడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని, వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తుంది.

ముఖ్యమంత్రి పర్యటనలో..

అనుకోని వర్షాల కారణంగా జరిగిన పంటనష్టాన్ని తెలుసుకుని రైతులకు భరోసా కల్పించే ఉద్దేశంతో బోనకల్ మండలంలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్ దిగగానే మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు లింగాల కమల్ రాజ్ కూడా ఆహ్వానం పలికారు. అనంతరం వెంటనే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి లింగాల ఆశీస్సులు తీసుకున్నాడు. వచ్చే సారి మధిర నుంచి పోటీ చేసేది తానేననే, సీఎం కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధుల ఆశీస్సులు సైతం తనకే ఉన్నాయని చెప్పకనే చెప్పాడు.

ఈ సమయంలోనే మధిర మాజీ నియోజకవర్గ ఇన్ చార్జీ, తెలంగాణ ఉద్యమకారుడు బొమ్మెర రాంమూర్తికి మాత్రం పరాభవం జరిగింది. సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లే అనుమతిలేదంటూ పోలీసులు అతన్ని బయటకు ఈడ్చుకెళ్లడం కనిపించింది. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుంటే నియోజకవర్గ నాయకులను అనుమతించకుండా వేరే నాయకులను అనుమతించడం చర్చకు దారితీసింది. ఇందులో కొందరు వివిధ పదవుల్లో ఉంటే.. మరికొందరు ఎలాంటి పదవులు లేకున్నా సీఎంను కలవడం విమర్శలకు తావిచ్చింది.

Advertisement

Next Story