నిత్య జీవితంలో సైన్స్​ పాత్ర కీలకం : మంత్రి పువ్వాడ

by Sridhar Babu |   ( Updated:2022-11-26 15:37:57.0  )
నిత్య జీవితంలో సైన్స్​ పాత్ర కీలకం : మంత్రి పువ్వాడ
X

దిశ, ఇల్లందు టౌన్ : మానవ నిత్య జీవితంలో సైన్స్ పాత్ర ఎంతో ఉందని, విద్యార్థి దశ నుండే వారిలోని సృజనాత్మకను, నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ కేంద్రంలోని సింగరేణి పాఠశాలలో జరుగుతున్న సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా 650 మంది విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల వైజ్ఞానిక యంత్రాలు, పరికరాలను సందర్శించారు. వారి ప్రతిభను చూసి మంత్రి అబ్బురపడి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఇలాంటి సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక, పరిశోధనల పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెరుగుతోందని అన్నారు. విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళికి ఉపయోగపడే పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. అందుకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మనందరికీ స్పూర్తిదాయకమన్నారు. సమాచారం, కమ్యూనికేషన్‌ టెక్నాలజీలో పురోగతి, పర్యావరణహితమైన పదార్థాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు , ఎంపీ మాలోత్ కవిత , ఎమ్మెల్సీ తాత మధు , ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ , కలెక్టర్ అనుదీప్ , ఎస్పీ వినిత్ , డీసీసీబీ చైర్మన్ నాగభూషణం , ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story