'ఆ జిల్లాలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల పాత్ర కీలకం'

by Sumithra |
ఆ జిల్లాలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల పాత్ర కీలకం
X

దిశ, ఖమ్మం టౌన్ : ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వాగ్దానాలు అమలు చేయలేకపోయాయని, ఓటమి ఖాయమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం నియోజకవర్గస్థాయి సీపీఎం పార్టీ జనరల్‌ బాడీ సమావేశం యర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగింది. ఈ సమావేశంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఏవో కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించి, ఓటర్లకు డబ్బు పంపిణీ చేసి మళ్ళీ అధికారంలోకి రావచ్చని కలలు కంటున్నాయని, ప్రజలను ప్రలోభాలతో ఎంతో కాలం మభ్యపెట్టలేరని, ఇప్పటికే ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో విసిగిపోయారని అన్నారు. కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బిజెపి ప్రధాని మోడీ దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నాడని, జాతీయ పరిశ్రమలన్నింటిని కారు చౌకగా పెట్టుబడిదారులకు అమ్మేస్తున్నాడని, మరోపక్క మతోన్మాద భావాలను అన్ని రంగాల్లో వ్యాపింపచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఈ విధానాలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర, వామపక్షశక్తులు పోరాడుతున్నాయని అన్నారు.

మరోవైపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొన్ని అమలు కాని వాగ్దానాలు చేసి మాటల గారడితో ప్రజలను నమ్మించి అధికారం చేపట్టిందని, నేడు ఆ తప్పుడు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, బీఆర్‌ఎస్‌ ఓటమి దగ్గరలోనే ఉన్నదని అన్నారు. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక భావాలు కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలు మతోన్మాద శక్తులతో మమేకమైన బీఆర్‌ఎస్‌ను, మతోన్మాద పార్టీ అయిన బీజేపీని జిల్లా నుండి తరిమికొట్టడం ఖాయం అన్నారు. రాబోయే ఎన్నికల్లో వామపక్షాల పాత్ర కీలకంగా వుండబోతోందని అన్నారు. ఈ సమావేశంలో సీపీఎం పార్టీ ఖమ్మం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ యర్రా శ్రీకాంత్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సమీనా, ఖమ్మం1 టౌన్‌, 2 టౌన్‌, 3 టౌన్‌, హవేలీ, అర్బన్‌, రఘునాధపాలెం మండలాల కార్యదర్శులు ఎంఏ జబ్బార్‌, బోడపట్ల సుదర్శన్‌, భూక్యా శ్రీనివాసరావు, యాదగిరి, మురారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed