ఖమ్మం జిల్లాలో వరద నష్టం రూ.730 కోట్లు

by Sridhar Babu |
ఖమ్మం జిల్లాలో వరద నష్టం రూ.730 కోట్లు
X

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం జిల్లాలో వరద నష్టం రూ.730 కోట్లుగా అంచనా వేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వెల్లడించారు. ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 31న అకాల వర్షం రావడం బాధాకరం అన్నారు. గత వంద సంవత్సరాల్లో ఎన్నడూ లేని బీభత్సాన్ని ఖమ్మం ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. శానిటేషన్ సేవలను ఎవ్వరు ఊహించని రీతిలో చేశారని తెలిపారు. ఇండ్లు శుభ్రం చేసుకోవడానికి ఫైర్ సిబ్బంది పని మరువలేనిదని పేర్కొన్నారు. అత్యవసరంగా స్పందించి పనిచేసిన ఆయా శాఖల అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజుల్లోనే సాధారణ పరిస్థితికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఒక్కో కిట్ కు 3 వేల చొప్పున హైసియా కంపెనీ నిత్యావసర వస్తువులు పంపించారని రూ.16,500 ఒక్కో కుటుంబానికి జమ చేస్తున్నాం అని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు మంజూరు చేసిందని అన్ని శాఖల అంచనాల మేరకు 730 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిసిందన్నారు. జిల్లా వ్యాప్తంగా మృతి చెందిన ఆరుగురికి 5 లక్షలు అందజేసినట్టు చెప్పారు. ఫౌల్ట్రీకి బాగా నష్టం జరిగిందని, 15 వేలకు పైగా ఇండ్లు ధ్వంసం అయ్యాయని స్పష్టం చేశారు. నేడు జిల్లాకు సెంట్రల్ టీం వస్తోందని జరిగిన నష్టాన్ని కేంద్ర కమిటీ దృష్టికి తీసుకొని వెళ్తాం అన్నారు. రూ.434 కోట్లు శాశ్వత పరిష్కారానికి అవసరమని స్కూల్స్, హాస్పిటల్స్ ను పునరుద్ధరణ చేశామని వివరించారు. వరికి 35 వేల ఎకరాల్లో డ్యామేజ్ జరిగిందని, దాని కోసం రూ.63 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు తెలిపారు. ఎకరానికి 10 వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కువగా మిర్చి, వెనిటేబుల్స్ పంటలకు నష్టం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 730 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి తెలియజేయనున్నామని చెప్పారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలో నష్టం ఎక్కువగా ఉందని సీఎం చెప్పారని పేర్కొన్నారు. మున్నేరు 40 అడుగులకు చేరడం ఎన్నడూ లేదన్నారు. సహకరించిన అన్ని పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed