‘ఢీ’ఎస్సీ.. అర్హులు వర్సెస్ అనర్హులు

by Aamani |
‘ఢీ’ఎస్సీ.. అర్హులు వర్సెస్ అనర్హులు
X

దిశ బ్యూరో, ఖమ్మం : ఈ సారి డీఎస్సీలో తమకు ఉద్యోగం కంపల్సరీ అనుకున్న కొందరు అభ్యర్థులకు జిల్లా అధికారుల తీరు విస్మయానికి గురిచేసింది. ర్యాంక్ కార్డు వచ్చింది మొదలుకుని కౌన్సిలింగ్ వరకు తమకు తిరుగులేదు అనుకున్న అభ్యర్థులు అనేకమంది విద్యాశాఖ అధికారుల తీరు తో ఉద్యోగం కోల్పోవడమే కాకుండా అనర్హులకు ఉద్యోగాలు దక్కడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. తప్పుల తడకగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆంధ్రా సర్టిఫికెట్లు ఉన్నవారికి లోకల్ క్యాడర్ లో పోస్టింగ్స్, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పుగా పెట్టిన చెక్ చేయకపోవడం, ఉపయోగంలో లేని, అనుమతులు లేని హిందీ సర్టిఫికెట్లను పరిగణలోకి తీసుకోవడం, ఫిర్యాదు చేసినా ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు పంపడంతో అసలైన కొందరు అర్హులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ విషయమై సోమవారం పదిమంది దాకా అభ్యర్థులు కలెక్టరేట్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో బహిర్గతమైంది. అంతేకాదు ఇలాంటి బాధితుల సంఖ్య జిల్లాలో దాదాపు వందమంది వరకు ఉంటుందని బాధితులు అంటున్నారు.

హిందీ పోస్టుల్లో ఇది తతంగం..

హిందీ పోస్టుల భర్తీలో నోటిఫికేషన్ ప్రకారం.. మూడు సంవత్సరాల డిగ్రీలో హిందీ సబ్జెక్ట్ కంపల్సరీ గా ఉండాలి. హిందీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి తప్పకుండా హిందీ సబ్జెక్ట్ చదివి ఉండాలి. మిగతా రెండు సబ్జెక్ట్స్ తో పాటు ఇది కూడా పూర్తి చేయాలి. డిగ్రీలో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోనైనా హింది తప్పకుండా చదివి ఉండాలి. డిగ్రీ, లేదా పీజీ లో ఎక్కడైనా హింది అభ్యర్థి హిందీ సబ్జెక్ట్ ను పూర్తి చేసి ఉండాలి. ఇవేవీ లేకుండా యూజీసీ గుర్తింపు లేని మధ్యమ, విధ్వాన్, విశారద అనే డిప్లొమా కోర్సులను అంగీకరించి ఉద్యోగాలు ఇచ్చారు. ఏ జిల్లాలో కూడా వీటిని పరిగణనలోకి తీసుకోలేదు..కానీ ఖమ్మం జిల్లాలో మాత్రమే ఇలాంటి వారికి అవకాశం కల్పించి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. అప్పటికే గమనించిన మిగతా అభ్యర్థులు కౌన్సెలింగ్ సమయంలో అధికారులకు సమాచారం అందించినా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రక్రియను పూర్తి చేశారు. తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం అందించగా తమకు అప్పుడే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఎదురు ప్రశ్నించడంతో అసలైన అభ్యర్థులు కంగుతిన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో ఒక్క అభ్యర్థిని మాత్రం విత్ హెల్డ్ లో పెట్టి మిగతా అభ్యర్థులను యథాతథంగా భర్తీ చేశారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ, లాంగ్వేజ్ పండిట్ హిందీల్లో విద్యార్హతలు లేని వారితో భర్తీ చేయడం జరిగిందని భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయి.

నాన్ లోకల్ క్రైటీరియాలోనూ లోపాలు..

డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం.. లోకల్ అభ్యర్థులకు 95 శాతం, నాన్ లోకల్ అభ్యర్థులకు 5 శాతం రిజర్వేషన్ కేటాయించగా ఈ ప్రాతిపదిక కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. నాన్ లోకల్ కు చెందిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన ధ్రువీకరణ పత్రాలు పరిగణలోకి తీసుకుని అనేక మందికి ఉద్యోగాలు కల్పించారు. ఆంధ్రా ప్రాంతంలో విద్యార్హతలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఉన్నా లోకల్ క్యాడర్ లో అర్హత సాధించడం విస్మయం గొలుపుతుంది. అంతేకాదు.. డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందు వరకు ఎస్సీ కేటగిరిలో ఉన్న ఓ అభ్యర్థి నోటిఫికేషన్ వచ్చాక బీసీ‌ సీ ధ్రువీకరణ పత్రం తో అదే క్యాటగిరీలో అర్హత సాధించి ఉద్యోగం పొందడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఏప్రిల్ 18, 2024 వరకు ఎస్సీ క్యాటగిరీ లో ఉన్న అభ్యర్థి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీసీ సీ కి మారి ఆ ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం సాధించడం.. ఒకే అభ్యర్థి రెండు కుల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండటంతో అసలైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కొందరు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో చదివిన నాన్ లోకల్ అభ్యర్థులకు సైతం వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు సాధించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కళ్లుమూసుకుని వారికి అర్హులుగా ప్రకటించి ఉద్యోగాల్లో భర్తీ చేశారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో వెరిఫికేషన్ అధికారిగా ఉన్న బనిగండ్లపాడు హెచ్ఎం ఈ తతంగంలో పాలు పంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కలెక్టర్ దృష్టి సారిస్తే అనేక విషయాలు వెలుగులోకి..

డీఎస్సీ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయని, జిల్లా విద్యాశాఖ సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో అట్టర్ ప్లాప్ అయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. డీఈఓ కు సమాచారం అందించినా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని, కొందరు తనకు అనుకూలమైన అభ్యర్థుల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ దృష్టి సారించి డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అందరి విషయంలో ఒక కమిటీ వేసి పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అనేక అవకతవకలు బయట పడతాయని, అనర్హులను గుర్తించి అర్హులకు ఉద్యోగాలివ్వాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story