పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

by Sumithra |
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
X

దిశ, ఖమ్మం సిటీ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు తమ తమ ప్రచారాలను పెద్ద ఎత్తున జరుపుకొని ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు జరిపాయి. 28 తో ప్రచారాల హోరుకి ఎలక్షన్ కమిషన్ బ్రేకులు వేయడంతో ఇక తుది అంకానికి ఎన్నికలు చేరుకున్నట్లయింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్ని నియోజకవర్గాల్లోని ఈవీఎంల తరలింపు కేంద్రాలను పరిశీలించి ప్రతి ఈవీఎంలను క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఐదు నియోజకవర్గాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంట పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ కూడా అన్ని ఈవీఎం తరలింపు కేంద్రాలను పరిశీలించారు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఇక తుది అంకాలైన పోలింగ్, ఫలితాల పై దృష్టి సారించేలా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వీపి.గౌతం పకడ్బందీగా చర్యలు చేపట్టారు.

జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే పోలీస్ సిబ్బంది చేరుకున్నారు. అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు పోలీస్ శాఖ తీసుకున్నట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో 1456 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఒక్కొక్క నియోజకవర్గం వారీగా చూసుకుంటే ఖమ్మంలో 355, పాలేరులో 289, మధిరలో 268, వైరాలో 252, సత్తుపల్లిలో 292 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,21,6796 మంది ఓటర్లకు గాను ఏర్పాట్లు చేస్తారని తెలుస్తుంది. అంతేకాకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున పోలింగ్ సమయంలో ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ప్రజలు ఉండకూడదని ఇప్పటికే పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు సహా కేంద్ర బలగాలు కూడా జిల్లాకు చేరుకోవడంతో మరింత పటిష్టమైన భద్రతను ఈ ఎన్నికల్లో నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ తెలిపారు. ఇక చివరి అంకమైన ఫలితాలు డిసెంబర్ 3న వెలువరించినన్నట్లు ఎన్నికల కమిషన్ ముందుగానే ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed