భేషజాలు మరిచిపోదాం...... అందరం ఐక్యంగా పని చేద్దాం

by Sridhar Babu |   ( Updated:2023-08-25 14:31:25.0  )
భేషజాలు మరిచిపోదాం...... అందరం ఐక్యంగా పని చేద్దాం
X

దిశ, వైరా : గతంలో ఉన్న భేషజాలను మరిచిపోయి అందరం కలిసి ఐక్యంగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేద్దామని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ అన్నారు. బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ భానోత్ మదన్ లాల్ ను ప్రకటించిన తరువాత తొలిసారిగా శుక్రవారం ఆయన వైరా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామ సమీపంలోని విజయ కళాశాల వద్ద మదన్ లాల్ కు ఘన స్వాగతం పలికారు. తనికెళ్ళ గ్రామం నుంచి వైరాలోని మధిర క్రాస్ రోడ్డు వరకు కార్లు, బైకులతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓపెన్ టాప్ జీపు పై నిల్చోని మదన్ లాల్ ప్రజలకు అభివాదం తెలిపారు. అనంతరం మధిర క్రాస్ రోడ్ లో వైరా మండలాధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో మదన్ లాల్ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో వైరా నుంచి పోటీ చేస్తున్న తనను ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పెద్దవాడిగా ముందుండి నడిపించాలని ఆకాంక్షించారు. రాములు నాయక్ సహాయ సహకారంతోనే ఎన్నికల్లో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

2018 ఎన్నికల్లో ఓడిపోయిన తనను నమ్ముకుని తనతో ప్రయాణం చేస్తూ ఇంతవరకు తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన చర్మం వలచి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేదని భావోద్వేగానికి గురయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి ఓటరు కు జవాబుదారీగా ఉండి పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు సుపరిపాలిన అందిస్తూ 24 గంటలు వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని చెప్పారు. రోజులో 24 గంటలు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్నారు. గతంలో ఉన్న భేషజాలాలను మరిచిపోయి అందరం ఐక్యమత్యంగా ఉందామని పిలుపునిచ్చారు. తన వల్ల గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే మన్నించమని కోరారు. అభివృద్ధి చేసి వైరా నియోజకవర్గ రుణం తీర్చుకునేందుకు వచ్చే

ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను నియోజకవర్గ ప్రజలు కడుపులో పెట్టుకొని దీవించాలన్నారు. శనివారం నుంచి నియోజకవర్గంలోని ప్రతి గడపకు వస్తానని చెప్పారు. త్వరలో నియోజకవర్గంలోని ఐదు మండలాల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా మంత్రి ఇతర ప్రజాప్రతినిధులతో పాటు రాములు నాయక్ తో కలిసి సభను ఏర్పాటు చేస్తామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వైరా నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ గెలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నా గడిచిన

రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవలేకపోయిందన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంగా పనిచేసి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి తన గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మదిర క్రాస్ రోడ్ లో వైరా నేలను ముద్దాడి భావోద్వేగానికి గురయ్యారు. మదన్ లాల్ రాకతో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed