Jayashankar sir : జయశంకర్ సార్ ఆశయాల కోసం కృషి చేయాలి

by Sridhar Babu |
Jayashankar sir : జయశంకర్ సార్ ఆశయాల కోసం కృషి చేయాలి
X

దిశ,కొత్తగూడెం : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ , అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తో కలిసి జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆచార్య జయశంకర్ జీవిత చరిత్రకి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను మననం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర మరువలేనిదని చెప్పారు. జయశంకర్ 1969 తెలంగాణ

ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నెముకగా ఆచార్య జయశంకర్ నిలిచారని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ది కోసం కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారని, ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ అధికారి అనసూయ, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, జిల్లా పరిపాలన అధికారి గన్యా, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర గ్రంథాలయంలో...

జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెంలో సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి సందర్భంగా జిల్లా కార్యదర్శి వి .అర్జున్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాఠకులతో పాటు గ్రంథాలయ ఆఫీస్ ఇంచార్జ్ ఎం.నవీన్ కుమార్, గ్రంథాలయ పాలకురాలు జి.మణిమృధుల , నాగన్న పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement

Next Story