- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియోజకవర్గ రాజకీయాల్లో "వైరా"గ్యం
దిశ, వైరా : గిరిజనులకు రిజర్వ్ అయిన వైరా నియోజకవర్గ రాజకీయాల్లో "వైరాగ్యం కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీల్లో ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో మూడుముక్కలాట నడుస్తుంది . అంతేకాకుండా పొత్తుల పుణ్యమా అని బీఆర్ఎస్ ఆశావాహుల్లో కమ్యూనిస్టుల టెన్షన్ దడ పుట్టిస్తుంది. కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి భయం వెంటాడుతుంది. నియోజకవర్గంలో నామా మాత్రంగా ఉన్న వైఎస్ఆర్టిపి లో కూడా టికెట్ కోసం వర్గ పోరు కొనసాగుతోంది. సిపిఐ అభ్యర్థి కోసం అన్వేషిస్తుండగా, సిపిఎం నుంచి ఒక్క అభ్యర్థి టికెట్ ను ఆశిస్తున్నారు. ఇలా వైరా నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది.
బీఆర్ఎస్ టికెట్ కోసం ముగ్గురు మధ్య పోరు
వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ముగ్గురు అభ్యర్థుల మధ్య పోరు నడుస్తోంది. ప్రస్తుత వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్ లాల్, బానోత్ చంద్రావతి వైరా టికెట్ ను ఆశిస్తున్నారు. సిట్టింగ్ లకే టికెట్లు కేటాయిస్తామని పలుమార్లు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రకటన ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ కు కొంత ఊరటనిస్తుంది . మరో మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కే అధిష్టానం టికెట్ కేటాయిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. రాములు నాయక్, మదన్ లాల్ మధ్య వర్గ పోరు వల్ల మధ్యే మార్గంలో తనకు టికెట్ వస్తుందని బానోత్ చంద్రావతి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు నియోజకవర్గంలో వేరువేరుగా పర్యటనలు చేస్తూ క్యాడర్ ను అయోమయానికి గురి చేయడం విశేషం.
బీఆర్ఎస్ ఆశావాహులకు కమ్యూనిస్టుల టెన్షన్
వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఆశావాహుల్లో కమ్యూనిస్టు పార్టీల టెన్షన్ పట్టుకుంది. వైరా నియోజకవర్గం ఏర్పడిన 2009 సంవత్సరం నుంచి సిపిఐ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఆ పొత్తుల్లో భాగంగా సిపిఐకు టికెటను కేటాయిస్తున్నారు. ఈసారి కూడా కమ్యూనిస్టుల పొత్తుల పుణ్యమా అని వైరా టికెట్ ను సీపీఐకి కేటాయిస్తారనే అనుమానం బిఆర్ఎస్ ఆశావాహులకు దడ పుట్టిస్తుంది. వైరా సిపిఐ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన బానోత్ విజయ భాయి పొంగులేటి వర్గంలో చేరారు. అయితే ప్రస్తుతం సిపిఐ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. పొత్తులో భాగంగా తమకు సీటు కేటాయిస్తే సిపిఎం అభ్యర్థిగా భూక్యా వీరభద్రం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా బిఆర్ఎస్ ఆశావాహుల్లో సిపిఐ, సిపిఎం టెన్షన్ నెలకొంది.
కాంగ్రెస్ పార్టీలోనూ అదే తీరు...
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కూడా మూడుముక్కలాటే కొనసాగుతుంది. భట్టి విక్రమార్క వర్గం నుంచి మాలోత్ రాందాస్ నాయక్, భానోత్ బాలాజీ నాయక్, రేణుకా చౌదరి వర్గం నుంచి ధరావత్ రామ్మూర్తి నాయక్ టికెట్ ను ఆశిస్తున్నారు. గత ఐదేళ్లుగా రాందాస్ నాయక్ నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి చవిచూసిన బాలాజీ నాయక్ ఇటీవల కాంగ్రెస్ లో చేరి టికెట్ ఆశిస్తున్నారు.
అదే విధంగా గత కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ లో చేరిన రామ్మూర్తి నాయక్ రేణుకా చౌదరి ఆశీస్సులతో టికెట్ తనకు దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రామ్మూర్తి నాయక్ వైరాలో కాంగ్రెస్ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు . ఇలా కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్న ముగ్గురు నేతలు నియోజకవర్గంలో వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బీజేపీ, వైయస్సార్టీపీలోను కొనసాగుతున్న వర్గ పోరు
వైరా నియోజకవర్గంలో నామమాత్రంగా ఉన్న బిజెపి, వైఎస్ఆర్టిపి పార్టీలోనూ వర్గ పోరు కొనసాగుతోంది. బిజెపి పార్టీ నుంచి కట్రావత్ మోహన్ నాయక్, బీపీ నాయక్, భూక్యా శ్యాంసుందర్ నాయక్ టికెట్ ను ఆశిస్తున్నారు. వీరు ముగ్గురు నియోజకవర్గంలో వేరువేరుగా బీజేపీ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైయస్సార్ టి పి నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్ ధర్మ సౌత్ రామునాయక్ తో పాటు రాంబాబు నాయక్ టికెట్ ను ఆశిస్తున్నారు. ఇలా ఈ రెండు పార్టీల్లో కూడా వర్గ రాజకీయం విరాజిల్లుతుంది.
ఆశావాహులను వెంటాడుతున్న పొంగులేటి భయం
నియోజకవర్గంలోని బీజేపీ, కాంగ్రెస్ ఆశావాహులను ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భయం వెంటాడుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి తన వర్గం నుంచి వైరా నియోజకవర్గ అభ్యర్థిగా బానోత్ విజయ భాయి పేరును ప్రకటించారు. అయితే పొంగులేటి నేటి వరకు ఏ పార్టీలో చేరతారో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. కొద్దిరోజులుగా బిజెపి లేదా కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి చేరతారని విస్తృత ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి చేరితే తమకు టికెట్ వస్తుందో లేదో అనే భయం ఆ పార్టీలోని ఆశావాహులకు నిద్ర లేకుండా చేస్తుంది.