ఆంధ్రాలో కన్నా నాకు తెలంగాణలోనే ఆదరణ ఎక్కువ : చంద్రబాబు

by Sridhar Babu |   ( Updated:2022-12-21 17:51:02.0  )

దిశ, ఖమ్మం సిటీ : ఆంధ్రాలో కన్నా తనకు తెలంగాణలోనే ఆదరణ ఎక్కువ అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఖమ్మం నగరంలో చాలా ఏళ్ల తర్వాత నిర్వహించిన టీడీపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పార్లమెంట్ సిగ్మెంట్ అధ్యక్షుడు కూరపటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభ జరిగింది. ముందుగా ఖమ్మం జిల్లా సరిహద్దులో పెద్ద ఎత్తున అభిమానుల మధ్య చంద్రబాబు నాయుడుకు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా విశేష జనవాహిని మధ్య టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం కు చేరుకున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ తెలంగాణలోనే పురుడు పోసుకుందని అన్నారు. టీడీపీ హయాంలో ప్రజలకు సుపరిపాలన అందిందని, ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించారని గుర్తు చేశారు. పేదలకు రెండు రూపాయలకే కేజీ బియ్యం అందించిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు. దేశంలో ఏ పార్టీ చేయని అభివృద్ధి పనులు తమ హయాంలోని జరిగిందని, తెలంగాణలో అత్యధిక ప్రాజెక్టులు కట్టిన ఘనత తమదేనన్నారు. తెలంగాణలో తెలుగుదేశంకు పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర రావాలన్నారు. సమర్ధవంతంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని, ఇక్కడ ఆ విధంగా లేకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హైద్రాబాద్ లో బయలుదేరిన దగ్గర నుంచి ఖమ్మం వచ్చే వరకు లభించిన ఆపూర్వ స్వాగతాన్ని జీవితంలో మరిచిపోలేనని చెప్పారు. హైద్రాబాద్ అభివృద్ధికి కారకుడిని తానేనని, ఐటీ ని హైద్రాబాద్ కు తీసుకొచ్చిన ఘనత తనదేనని గుర్తు చేశారు. తాను ప్రారంభించిన ప్రాజక్టులను ఇక్కడి ప్రభుత్వం కొనసాగించడాన్ని స్వాగతించారు. శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కర్తను కూడా తానేనని చెప్పుకొచ్చారు. తాను కోరుకునేది అధికారం కాదని, ప్రజల అభిమానం అని ఉద్గాటించారు. తాను నిరంతరం ప్రజల మేలుకోసం, పిల్లల భవిష్యత్ కోసం ఆలోచించానని పేర్కొన్నారు.

ALSO READ : Disha Interview: టీడీపీదే రాజ్యాధికారం

Advertisement

Next Story

Most Viewed