అప్పనంగా వచ్చిన బియ్యం ఆరగించాడు

by Sridhar Babu |
అప్పనంగా వచ్చిన బియ్యం ఆరగించాడు
X

దిశ, వైరా : ఒక్క రూపాయి పెట్టుబడి లేదు. మిల్లు నిర్వాహణకు ధాన్యం కొనాల్సిన అవసరం అంతకంటే లేదు. ధాన్యం ఆడించిన మిల్లింగ్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. ధాన్యం మర ఆడించిన తర్వాత వచ్చే ఉప ఉత్పత్తులు కూడా మిల్లర్లకే మిగులుతాయి. ప్రభుత్వమే నయా పైసా లేకుండా ధాన్యం మిల్లర్లకు సరఫరా చేస్తుంది. అయితే ఎప్పటి ధాన్యాన్ని అప్పుడు మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం అప్పగించాల్సిన ఓ రైస్ మిల్లర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. కష్టం మిల్లింగ్ రైస్ డెలివరీ ఇవ్వడం లేదు. ధాన్యం తీసుకొని సంవత్సర కాలం కావస్తున్నా ప్రభుత్వానికి నేటికీ బియ్యం అందించలేదు.

ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని విక్రయించి బియ్యం ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ఇది వైరా నియోజకవర్గంలోని కొణిజర్లలో ఉన్న శ్రీ శ్రీనివాస రైస్ మిల్లు యజమాని బాగోతం. గత ఏడాది ఖరీఫ్ సీజన్ ధాన్యాన్ని ప్రభుత్వం ఇతనికి 40 ఏసీకేలు కేటాయించింది. అయితే నేటి వరకు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేయలేదు. అయితే ప్రభుత్వం మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లు యజమాని విక్రయించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి బియ్యం వెంటనే సరఫరా చేయాలని ఆదేశించినా సదరు మిల్లు యజమాని వారి ఆదేశాలను లెక్క చేయటం లేదు. ఈనెల చివరికల్లా మిల్లర్లు అంతా బియ్యాన్ని అప్పగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గడువు పొడిగించింది. అయినా ఈ రైస్ మిల్లు యజమాని పట్టించుకోలేదు. జరిమానా వేసినా డోంట్ కేర్ అంటున్నాడు.

17 ఏసీకేలు ధాన్యం పెండింగ్

గత ఖరీఫ్ సీజన్లో కొణిజర్లలోని శ్రీ శ్రీనివాస రైస్ మిల్లుకు సీఎంఆర్ కోసం ప్రభుత్వం 40 ఏసీకేల ధాన్యాన్ని కేటాయించింది. అయితే గడిచిన సంవత్సర కాలంలో సదరు మిల్లు యజమాని 23 ఏసీకేల ధాన్యాన్ని మర పట్టించి బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేశాడు. మిగిలిన 17 ఏసీకే ల ధాన్యాన్ని మర ఆడించకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ 17 ఏసీకేల ధాన్యంకు సంబంధించిన బియ్యం పెండింగ్ లో ఉంది. ఇంత బియ్యం పెండింగ్ లో ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

నిబంధనల ప్రకారం 75 రోజుల్లోపు సదరు రైస్ మిల్లు యజమాని ప్రభుత్వానికి బియ్యం అప్పగించాల్సి ఉంటుంది. అయితే సంవత్సర కాలం కావస్తున్నా బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని అమ్ముకున్న మిల్లర్ పై కనీస చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. ధాన్యం తీసుకునేటప్పుడు మిల్లర్లు తేమ, మట్టి శాతాన్ని పరిశీలించిన తర్వాతనే దిగుమతి చేసుకుంటారు. అయితే సదరు మిల్లు యజమాని తనకు కేటాయించిన ధాన్యం ముక్కి పోయిందని చెప్పటం విశేషం.

ఈ విషయమై పౌరసరఫరాల శాఖ కొణిజర్ల ఇన్చార్జి డీటీ విజయబాబును దిశ వివరణ కోరగా శ్రీ శ్రీనివాస రైస్ మిల్లు 17 ఏసీకే ల బియ్యం అప్పగించాల్సిన విషయం వాస్తవమే అని చెప్పారు. అయితే ఇటీవల 3 ఏసీకే ల బియ్యాన్ని అప్పగించారని వివరించారు. మిగిలిన 14 ఏసీకే ల బియ్యాన్ని ఈ నెలాఖరు లోపు అప్పగించకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed