నిండా ముంచిన మున్నేరు.. సర్వం కోల్పోయిన ప్రజలు

by Mahesh |
నిండా ముంచిన మున్నేరు.. సర్వం కోల్పోయిన ప్రజలు
X

ఖమ్మం చరిత్రలో ఎన్నడు లేని విధంగా వచ్చిన మున్నేరు వరద అక్కడి ప్రజలను నిలువునా ముంచింది. వందలాది ఇండ్లు ముంపునకు గురై ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఇండ్లల్లోకి మోకాళ్లలోతు బురద చేరింది. వరద తేరుకోవడంతో ఇండ్లల్లో బురద శుభ్రపరుచుకునే పనిలో పడ్డారు. ఏ తలుపు తట్టినా, ఏ నోట విన్నా నష్టం గంటల వ్యవధిలోనే జరిగిందని బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కేవలం మనుషులం మాత్రమే మిగిలామని, సర్వం కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. లారీ యజమానుల సంఘం కార్యాలయంలో నిలిపి ఉంచిన 150లారీలు వరదల్లో మునిగిపోయాయని యజమాని వాపోయాడు. మరోవైపు అధికార యంత్రాంగం ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ట్రైనీ పోలీసులు, సహా బెటాలియన్ సిబ్బందిని ఈ సహాయక చర్యల్లో పాల్గొనేలా సీపీ ఆదేశాలు జారీ చేశారు.

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగరంలో మున్నేరు ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంత ప్రజలు వరద ముంపునకు గురైన సంఘటన విదితమే. ఖమ్మం చరిత్రలో ఎన్నడు లేని విధంగా వరద బీభత్సం సృష్టించడంతో వందలాది ఇల్లు వరద ముంపునకు గురై ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలను నష్టాన్ని చేకూర్చింది. దీంతో రెండు రోజులుగా బొక్కల గడ్డ, మోతీనగర్, వెంకటేశ్వరనగర్, పద్మావతి నగర్, శ్రీనివాస్ నగర్, ప్రకాష్ నగర్, దంసలాపురం, పంపింగ్ వెల్ రోడ్, పెద్దమ్మ గుడి , సుందరయ్య నగర్‌లో ప్రజలు వారి ఇండ్లల్లో శుభ్రపరుచుకునే పనిలో పడ్డారు. తమకు జరిగిన నష్టాన్ని దిగమింగుకుంటూ వరదల్లో కొట్టుకోని పోగా మిగిలిన వస్తువులను శుభ్రపరచుకుంటున్నారు. ఏ తలుపు తట్టినా, ఏ నోట విన్న నష్టం గంటల వ్యవధిలోనే జరిగిందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.

నగరంలోని పుర ప్రముఖుల ద్వారా అందుతున్న ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్లతో కడుపు నింపుకుంటూ ఇండ్లలో చేరుకున్న బురదను తొలగిస్తూ కుమిలిపోతున్న పరిస్థితి నెలకొంది. కేవలం మనుషులమే మిగిలామంటూ సర్వం కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. మోతి నగర్‌లో ఈ వరదతో పెద్ద పెద్ద భవనాల ప్రహరీ గోడలు సైతం కూలిపోయాయి. పంపింగ్ వెల్ రోడ్‌లోని పెద్దమ్మ గుడి ప్రాంతంలో ముంపునకు గురైన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఊహించని వరదతో ప్రమాదం జరగడంతో ముంపు ప్రాంత ప్రజల్లో అలజడి మొదలైంది. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇప్పుడు జరిగిన నష్టాన్ని మునుముందు రోజుల్లో జరగకుండా కరకట్ట కానీ, కాంక్రీట్ వాల్ నిర్మాణాలను కానీ త్వరితగతిన పూర్తి చేసి తమను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన మంత్రులు తిరిగి ప్రజలకు ధైర్యం చెబుతూ ఓదార్చింది.

వరదల్లో ఎవరెవరికి ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ప్రతి ఇంటి కి చేరుకొని సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పదివేల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందిస్తేనే తప్ప అక్కడి ప్రజలు ఇండ్లలో జీవనాన్ని కొనసాగించడానికి వీలు కాదు.వెంకటేశ్వర నగర్ లో వరద బీభత్సం వల్ల అతలాకుతులం అయిన కుటుంబాలు ఆర్థిక సహాయాల కోసం ఎదురుచూస్తున్నాయి. లారీ యజమానుల సంఘ కార్యాలయంలో నిలిచిన 150లారీలు ఈ వరదల్లో మునిగి పోవడం ఒక్కొక లారికి రూ.40 నుంచి రూ.50వేలు నష్టం వాటిల్లిందని లారీ యజమాని తిరుపతి రావు ఆవేదన వ్యక్తంచేశారు జిల్లా కలెక్టర్ ముజామిల్, ఖాన్ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సీపీ సునీల్ దత్, మిగిలిన జిల్లా అధికారులు ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ట్రైనీ పోలీసులతో సహా బెటాలియన్ సిబ్బందిని ఈ సాహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనేలా సీపీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అంటురోగాలు ప్రబలకుండా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed