అయ్యో ఆ కుటుంబానికి దిక్కెవరు.. చీకట్లు నింపిన రోడ్డు ప్రమాదం

by samatah |
అయ్యో ఆ కుటుంబానికి దిక్కెవరు.. చీకట్లు నింపిన రోడ్డు ప్రమాదం
X

దిశ, వైరా : వివాహం జరిగిన తర్వాత సుమారు 12ఏళ్లకు జన్మించాడు. ఒక్కగానొక్క కుమారుడని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు. కష్టపడి తమ కుమారుడిని ఎంబీఏ చదివించారు. గత 15ఏళ్లగా ఉద్యోగం చేస్తూ తన కుటుంబంతో పాటు తన తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో రోడ్డు ప్రమాదం చీకట్లు నింపింది. కుమారుడు, మనువడు, కొడలును మృత్యువు కబళించటంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణాతీతంగా మారింది. రాజేశ్ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నది. ఈ హృదయ విదారక సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో అనుకుంటున్నారు. ఇక తమకు దిక్కు ఎవరంటూ ఆ వృద్ధ దంపతులు విలపిస్తున్న తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఏడిపిస్తున్నది.

విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి బాబురావు, సరోజని దంపతులకు వివాహం జరిగిన 12ఏళ్లకు కుమారుడు రాజేష్ జన్మించాడు. రాజేశ్‌ను తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి ఎంబీఏ వరకు కష్టపడి చదివించారు. 2008లో హైదరాబాదులోని లారెస్ ఫార్మా కంపెనీలో ట్రైనీ ఉద్యోగిగా చేరిన రాజేశ్ అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఎకౌంటు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రాజేశ్, సుజాత దంపతులకు దివిజిత్ శ్రీరామ్, ఆశ్రిత్ శ్రీరామ్ సంతానం ఉన్నారు. నెలకు వచ్చే జీతంతో రాజేశ్ తన కుటుంబంతో పాటు తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు కొణిజర్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేశ్, సుజాత సహా చిన్న కుమారుడు ఆశ్రిత్ శ్రీరామ్ దుర్మరణం చెందారు. పెద్ద కుమారుడు దివిజిత్ శ్రీరామ్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

ఆనందం ఆవిరి..

రాజేష్ హైదరాబాద్ లోని లారెస్ ఫార్మా కంపెనీలో 15ఏళ్లుగా పని చేస్తూ అకౌంట్ మేనేజర్ గా ఎదిగాడు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రాజేశ్‌కు గతనెల కంపెనీ సీఈఓ చావా సత్యనారాయణ ప్రశంసా పత్రంతో పాటు రూ.3.75 లక్షల నగదు రివార్డును అందజేశారు. అవార్డు పొందిన ఆనందం వారం రోజులు కూదా మిగిలలేదు. ఇంతలోనే రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. వాస్తవానికి రాజేష్ ఈనెల2,3 తేదీల్లో ఉద్యోగానికి సెలవు పెట్టాడు. బుధవారం రాత్రి 7 గంటలకు ఆఫీస్‌కు వెళ్లిన రాజేశ్ ఇంటికి వెళ్లేందుకు తనకు ఒకటి నుంచి సెలవు కావాలని డిప్యూటీ జనరల్ మేనేజర్ కొమ్మినేని సతీశ్‌ను కోరగా మంజూరు చేశాడు. దీంతో బుధవారం అర్ధరాత్రి రాజేశ్ తన కుటుంబ సభ్యులతో విప్పలమడక బయలుదేరాడు. రాజేశ్ అప్పటికప్పుడు సెలవు పెట్టకుండా ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed