బీఆర్ఎస్ లో ఉన్నా నాది కమ్యూనిస్టు భావజాలమే : ఎమ్మెల్యే రాములు నాయక్

by Sridhar Babu |
బీఆర్ఎస్ లో ఉన్నా నాది కమ్యూనిస్టు భావజాలమే : ఎమ్మెల్యే రాములు నాయక్
X

దిశ, వైరా : "నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ నాలో కమ్యూనిస్టు భావాజాలమే ఉంది... నా కుటుంబం కమ్యూనిస్టు తానులో ముక్కే ... మా తాత, తండ్రి గతంలో కమ్యూనిస్టు పార్టీలోనే కొనసాగారు" అని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర బుధవారం వైరాకు చేరుకుంది. ఈ సందర్భంగా వైరాలోని మధిర క్రాస్ రోడ్ లో నిర్వహించిన సభకు ఎమ్మెల్యే రాములు నాయక్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరై జనచైతన్య యాత్రకు తమ సంఘీభావాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఇతర నేతలకు ఎమ్మెల్యే రాములునాయక్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న తనది కమ్యూనిస్టు భావాజాలమే అని స్పష్టం చేశారు. తన కుటుంబం గతంలో కమ్యూనిస్టు తానులో ముక్కేనని వివరించారు. తన తండ్రి, తాతలు గతంలో కమ్యూనిస్టు పార్టీలోనే కొనసాగారని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనచైతన్య యాత్ర అవసరం నూరు శాతం ఉందన్నారు. దేశంలో బీజేపీ అకృత్యాలు, అఘాయిత్యాలు, రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధానాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశాన్ని బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దోచిపెడుతుందని విమర్శించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఎం చూస్తూ ఊరుకోదన్నారు. జన చైతన్య యాత్రకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వ దుర్మార్గాలు పెరిగిపోవటంతో బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు చేయి చేయి కలిపాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, ప్రగతిని నిరోధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై సీబీఐ, ఈడీ సంస్థలను ఉసిగొలిపి దాడులు చేయిస్తుందని ఆరోపించారు.

విభజన హామీలను నెరవేర్చి, రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోడీ అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యమై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సంఘీభావం తెలిపిన వారిలో వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్, దిశ కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, నాయకులు కాపా మురళీకృష్ణ, మచ్చా వెంకటేశ్వరరావు(బుజ్జి), వనమా విశ్వేశ్వరరావు, దారెల్లి కోటయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed