సంక్రాంతి నాటికి 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

by Sridhar Babu |
సంక్రాంతి నాటికి 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
X

దిశ, దమ్మపేట : సంక్రాంతి పండుగ నాటికి మొదటి విడతగా రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం దమ్మపేట మండలంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వ విజయ్ బాబుతో కలిసి మండలంలోని నాచారం, గున్నేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభించి, దమ్మపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనా భవనానికి శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల జీవితాల్లో మార్పు తీసుకురాగలమని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఇండ్లు నిర్మిస్తామని , ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇండ్లు కట్టి తీరుతామని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఆ పార్టీ నాయకులు కేవలం మాటలకే పరిమితమయ్యారు తప్ప, ప్రజలకు చేసిందేమీలేదని అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి తీరుతామని, ఇప్పటికే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 85 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న వారికోసం ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు సేకరిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో పింకు చొక్కాలు వేసుకున్న వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందాయని, కాంగ్రెస్ పాలనలో అలా ఉండదని, పారదర్శకంగా కేవలం అర్హులైన పేదవారికి మాత్రమే ఇండ్లు మంజూరు చేస్తామని, ఎటువంటి ఫైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ కమిటీలు అర్హులైన వారిని పారదర్శకంగా గుర్తించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిరంతర ప్రక్రియని, ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు అందిస్తామని అన్నారు.

జర్నలిస్టులను ఆదుకుంటాం

రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులను ఆదుకుంటామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టులు పైకి మంచిగానే కనపడుతున్నప్పటికీ వారికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా చూస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు అందించాలి : ఎమ్మెల్యే జారే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అన్నారని, అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఉండటంతో, ఇక్కడ ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని, అశ్వారావుపేట నియోజకవర్గానికి ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు.

ఈ మాటకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఇన్​చార్జి ఆర్డీఓ కాషయ్య, దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, కాంగ్రెస్ నాయకులు రావు గంగాధరరావు, సత్యంబాబు, యరగొర్ల రాధాకృష్ణ, పర్వతనేని ప్రసాద్, సాయిల నరసింహారావు, చిన్న శెట్టి యుగంధర్, పగడాల రాంబాబు, దొడ్డ భాస్కర్, చామర్తి గోపి శాస్త్రి, రావు పండు, రొయ్యల కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed