Koushik Reddy: పాడి కౌశిక్‌ రెడ్డిపై పీడీ యాక్ట్..? కఠిన చర్యలకు ప్రభుత్వం సన్నద్ధం

by Shiva |
Koushik Reddy: పాడి కౌశిక్‌ రెడ్డిపై పీడీ యాక్ట్..? కఠిన చర్యలకు ప్రభుత్వం సన్నద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ ఎమ్మెల్యే​ పాడి కౌశిక్ రెడ్డిపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా ఆయన చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలు, దుందుకుడు చర్యలపై పలు కేసులు నమోదయ్యాయి. ఆయన వ్యవహారశైలి, తీరుపై అనేక అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. బాధ్యతాయుత ప్రజాప్రతినిధిగా ఆయన తీరుపై విసిగెత్తిన పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనికి ప్రభుత్వం సైతం ఓకే అని చెప్పినట్టు రాజకీయ వర్గాల ద్వారా తెలిసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్‌పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పీడీ యాక్ట్ నమోదు చేసింది. ఆర్నెళ్ల వ్యవధిలో ఒకే తరహా నేరాలు మూడు కన్నా ఎక్కువ సార్లు చేస్తే ఈ యాక్ట్ కింద కేసు నమోదుచేయవచ్చు. పీడీ యాక్ట్​ప్రయోగిస్తే ఏడాది జైలు శిక్ష పడుతుంది.

వివాదాలకు కేరాఫ్..

రాష్ట్ర రాజకీయాల్లో వివాదాలకు కేరాఫ్‌గా మారిన పాడి కౌశిక్ రెడ్డి తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై మూడు ఫిర్యాదులు అందగా మూడు కేసులు నమోదు చేశారు. మరో వైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే కరీంనగర్ ​కలెక్టరేట్‌లో డీఈవోను దూషించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. అసెంబ్లీలో అనేక మార్లు స్పీకర్ హెచ్చరించినా ఆయన తీరు మారలేదు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై మానుకోట రాళ్ల దాడి ఘటన ఉండనే ఉన్నది. ఆయన ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మహిళా గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను జాతీయ మహిళా కమిషన్ చీవాట్లు పెట్టింది. మంత్రి సీతక్కపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో ఘర్షణ, బంజారాహిల్స్ పీఎస్‌లో నానా హంగామా సృష్టించడం, అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులపైకి పేపర్లు చించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో తన విజయయాత్రనో, శవయాత్రనో అని, ఈ సారి గెలిపించకుంటే కూతురు, భార్య తాను ఆత్మహత్య చేసుకుంటామని చెప్పిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. ఇలా వరుస వివాదాల నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇక ఉపేక్షించవద్దనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది.

మరింత గెచ్చగొట్టేలా కేటీఆర్ ట్వీట్

బీఆర్ఎస్​ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుండగా, కట్టడి చేయాల్సిన పార్టీ నాయకత్వం ఆయనను మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. కరీంనగర్ కలెక్టరేట్​ఘటనపై కౌశిక్‌రెడ్డిని అభినందిస్తూ.. ‘వెల్ డన్ ​కౌశిక్​రెడ్డి’ అంటూ ఆదివారం కేటీఆర్ ట్వీట్​చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేను ప్రశ్నించిన పాడిని అభినందిస్తున్నట్టు చెప్పారు. కానీ, కౌశిక్ రెడ్డి తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కౌశిక్ వల్ల పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ అవుతున్నదని అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా ఆయన వ్యవహారం వల్ల అసలు అంశాలు పక్కదారి పడుతున్నాయని పలువురు బీఆర్ఎస్ లీడర్లు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరికపూడి గాంధీకి చీర, గాజులు పంపిస్తానని పార్టీ కార్యాలయంలోనే మీడియా సాక్షిగా చెప్పడంతో పార్టీ నాయకులు తలలు పట్టుకున్నారు. ప్రజలకు, మహిళలకు ఎలా సమాధానం చెప్పా తెలియక సతమతమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో పాడి కౌశిక్ రెడ్డిని అధినేత కేసీఆర్, ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావు కంట్రోల్ చేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్‌కు ప్లస్ అనుకున్న పాడి కౌశిక్ రెడ్డి వల్ల ముప్పు తప్పదనే చర్చ జరుగుతున్నది.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ శాసనసభపక్షం విలీనం కాకమునుపే ఆ పార్టీలో గెలిచిన తలసానికి మంత్రి పదవి ఇచ్చారని కాంగ్రెస్​పార్టీ ప్రశ్నిస్తుంది. దీనిపై ఇంత వరకు సూటిగా సమాధానం చెప్పలేని గులాబీ పార్టీ.. గురివింజ సామెత లాగా వ్యవహరిస్తున్నదంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేస్తున్నది. విధానాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో, చట్టం, రాజ్యాంగానికి లోబడి అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చని, అంతే కానీ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు దిగుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తే సహించబోమని స్పష్టం చేస్తున్నారు. చిన్నోళ్లు తింటే చిరు తిండి, పెద్దోళ్లు తింటే ఫలహారం అన్నట్టుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



Next Story

Most Viewed