సీఎం కేసీఆర్ దగ్గర చనువు ఉంది : ఎమ్మెల్యే మెచ్చా

by Sridhar Babu |
సీఎం కేసీఆర్ దగ్గర చనువు ఉంది : ఎమ్మెల్యే మెచ్చా
X

దిశ, అశ్వారావుపేట : టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేని అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కోరుకున్న విధంగా నిధులు తీసుకువచ్చేంత చనువు సీఎం కేసీఆర్ వద్ద తనకి ఉందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ మీడియా కథనంలో గత ఆరు నెలల క్రితం ఉన్న పరిస్థితులను ఇప్పటివిగా చూపించారన్నారు.

నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ప్రజలు కోరుకుంటున్న ఎన్నో పనులను గడిచిన 6 నెలల్లో చేసి చూపించానని తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నాలుగేళ్లలో నియోజకవర్గంలోని ఐదు మండలాలలో ప్రభుత్వ పథకాల ద్వారా ఖర్చు చేసిన.. మంజూరైన నిధుల వివరాలను మెచ్చా వెల్లడించారు. సుమారు రూ.1022 కోట్ల వ్యయంతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆర్టిఏ సబ్ యూనిట్ ఆఫీస్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని.. త్వరలో ఏర్పాటు కానున్న అశ్వారావుపేట డిగ్రీ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.

నియోజకవర్గ కేంద్రం, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రాలలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిందని గుర్తు చేశారు. దమ్మపేటలో కోర్టు, జూనియర్ కళాశాల, అశ్వారావుపేట లో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు కావడంతో నిధుల వివరాలు తెలిపానని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed