అంగన్‌వాడీల లక్ష్యం అబాసుపాలు

by Mahesh |
అంగన్‌వాడీల లక్ష్యం అబాసుపాలు
X

దిశ, ములకలపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల పని తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు అన్న చందంగా మారింది. నిత్యం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్డు బలమైన భోజనం పెట్టాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా జరుగుతూ ప్రభుత్వ లక్ష్యం అబాసు పాలవుతుంది. గడచిన రెండు నెలలుగా ఏజెన్సీ ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు, మంచి నూనెతో పాటు కందిపప్పు అందడం లేదు.

కేవలం బియ్యం మాత్రమే అందుబాటులో ఉండటంతో కొత్త కార్యకర్తలు సొంత ఖర్చులతో వండిపెడుతుండగా, మరికొంత మంది చేతిలో డబ్బులు లేక రోజూ సెంటర్లకు వెళ్లి ఖాళీగా కూర్చొని వస్తున్నట్లు సమాచారం. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాలకు సురుకులు సరఫరా చేసే ఏజెన్సీ తప్పిదాలను సీడీపీఓలు, సూపర్‌వైజర్‌లు వెనకేసుకొస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయా సెంటర్లకు స్టాకు వెళ్లకుండా మధ్యలో దింపి వెళ్తున్న టెండర్ ఏజెన్సీలను వీరు ప్రోత్సహిస్తున్నారని సమాచారం.

రెండు నెలలుగా అందని స్టాక్..

గడచిన రెండు నెలలుగా ఏజెన్సీ ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు, మంచి నూనె తో పాటు కందిపప్పు అందలేదు. ఆయా సెంటర్ పరిధిలోకి వచ్చే గర్భిణులు, బాలింతలకు ఎలాంటి పౌష్టికాహారం అందడం లేదు. కేవలం అంగన్‌వాడీ కార్యకర్తలు వారి సెంటర్లను ఓపెన్ చేసి కాలక్షేపం చేసి రావాల్సిన పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక కార్యకర్త వాపోయింది.

ఆర్భాటమే..

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో రోజూ ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. సీమంతం వేడుకలు, పొష్టికాహారం దినోత్సవాలు, తల్లి పిల్లల సంరక్షణ అంటూ అందమైన కార్యక్రమాలకు అంతూ పొంతూ ఉండదు. సూపర్వైజర్‌ల ఆర్బాటం, కార్యకర్తల ఆరాటం చూస్తే పొష్టికాహారం ఎంతగొప్పగా అందుతుందో అని అందరూ అనుకుంటారు. క్షేత్ర స్థాయిలో దీనికి విరుద్ధంగా ఏ సెంటర్లో కూడా తినడానికి తిండి దొరక్క బక్కచిక్కిన లబ్ధిదారులే దర్శనమిస్తున్నారు. కేవలం బియ్యం మాత్రమే అందుబాటులో ఉండి తమ సొంత ఖర్చులతో కూరగాయలు, పప్పు, నూనె తీసుకువచ్చి వండిపెట్టేవారు కొందరైతే చేతిలో డబ్బులేక రోజు సెంటర్లను వెళ్లి ఖాళీగా కూర్చొని వచ్చే వాళ్ళు మరికొందరు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

నీరుగారుతున్న లక్ష్యం..

బలమైన సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం నీరుగారుతోంది. నెలల తరబడి ఎలాంటి పౌష్టికాహారం కేంద్రాల్లో అందుబాటులో లేక పేదలు, గిరిజనులు వారి ఇండ్లలో ఉండే కలో గంజో తాగి కడుపు నింపుకోవాల్సి రావడం చాలా బాధాకరం. పొష్టికాహారం అనేది నిత్యం అందితేనే గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. దీనికి విరుద్ధంగా నెలల తరబడి కేంద్రాలకు సరుకులు అందకపోతే ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోయినట్లే అనడంలో సందేహం లేదు.

దాపరికం ఎందుకు..?

ఐసీడీఎస్ ఏమైనా రహస్య సంస్థా...? అందులో ఏమి జరిగినా గుట్టుచప్పుడు కాకుండా వాళ్లలో వాళ్లే సరిచేసుకుంటూ విషయం బయటకు రాకుండా పనులు కొనసాగించడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఏ ఉద్దేశంతో ఈ సంస్థలు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం క్షేత్ర స్థాయిలో అబాసుపాలు అవుతుంటే అధికారులు ఎందుకు ఈ విషయాన్ని దాచి పెట్టి తమ విధులు నిర్వహిస్తున్నారు..? కింది స్థాయి కార్యకర్తలను నోరు మూపించి మరీ పనులు చేపిస్తున్నారు..? స్టాకు లేదని చెప్పేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు..? అంగన్వాడీ కేంద్రాలకు సురుకులు సరఫరా చేసే ఏజెన్సీ తప్పిదాలను సీడీపీఓలు, సూపర్‌వైజర్‌లు వెనకేసుకు రావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంగన్‌వాడీ కేంద్రాల వరకు స్టాకు వెళ్లకుండా మధ్యలో దింపి వెళ్తున్న టెండర్ ఏజెన్సీ లను అధికారులు ప్రోత్సహిస్తున్నారని తెలుస్తున్నది. ఏది ఏమైనా అంగన్‌వాడీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం మూలంగా ఏజెన్సీలో పొష్టికాహార బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నది అనడంలో సందేహం లేదు. ఉన్నతాధికారులు దృష్టి సారించి నిత్యం కేంద్రాల్లో స్టాకు ఉండేలా చర్యలు తీసుకోకపోతే బక్కచిక్కిన భారతం గ్రామీణ ప్రాంతాల్లో దర్శనమిస్తుంది అనడంలో సందేహం లేదు.

గుడ్లు దింపకుండానే వేలిముద్రలు..

సాధారణగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ విధానమే కొనసాగుతున్నది. పోషకాహారం ఏది దింపాలన్నా దానికి అంగన్‌వాడీ కార్యకర్తల ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి. ఇటీవల మార్చినెల అంగన్‌వాడీలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు గుడ్లు దింపకుండానే వేలిముద్రలు వేయించినట్లు తెలిసింది. అధికారికంగా కోడి గుడ్లు అంగన్‌వాడీలకు గుత్తేదారు గుడ్లు దింపినట్లు ప్రభుత్వానికి సమాచారం వెళుతున్నది. క్షేత్ర స్థాయిలో మాత్రం స్టాకు ఉండదు. ఎవరైనా ఉన్నతాధికారులు తనిఖీలకు వస్తే పూర్తి భాద్యత అంగన్‌వాడీలపై ఉంటుంది. రికార్డుల్లో మాత్రం స్టాక్ కేంద్రాల్లో దిగినట్లు ఉంటుంది. తనిఖీ సమయంలో స్టాక్ ఉండదు తప్పు అంగన్‌వాడీలపై వేసుకొని నిందవారు అనుభవించాల్సి ఉంటుంది.

Next Story

Most Viewed