- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
PCC chief : మంత్రి వర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ హింట్.. వచ్చే కేబినెట్ లో వారికి పక్కా ఛాన్స్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) హాట్ కామెంట్స్ చేశారు. అవి తొలగిపోయి అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ తేదీని ప్రకటిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 3 లేదా 4 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం అంతా మీడియా సృష్టి అని అన్నారు. తామెక్కడా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంపై తేదీలు చెప్పలేదన్నారు. కేబినెట్‌లో ఆరు స్థానాలు ఖాళీగా ఉంటే చాలా మంది పోటీ పడుతున్నారన్నారు. ఈ విషయంలో అధిష్టానం వ్యక్తిగతంగా, సమిష్టిగా తమ అభిప్రాయాలను సేకరించిందని వెల్లడించారు. ప్రస్తుత కేబినెట్ లో ఇద్దరు బీసీలు ఉన్నారని మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని పీసీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానానికి కోరానన్నారు. రాబోయే కేబినెట్ విస్తరణలో మైనార్టీకి తప్పకుండా అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మరో వైపు తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున పోటీ నెలకొనడంతో అధిష్టానానికి ఈ అంశం చిక్కుముడిగా మారినట్లు తెలుస్తోంది.
టీపీసీసీ వ్యాఖ్యలతో కొత్త చర్చ:
రాబోయే మంత్రివర్గ విస్తరణలో మైనార్టీలకు (Minority) డెఫినెట్ గా అవకాశం ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అదే నిజం అయితే ఆ చాన్స్ దక్కించుకోబోతున్నది ఎవరూ అనేది హస్తం పార్టీలో చర్చనీయాంశం అవుతున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ వర్గం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్ అలీ ఖాన్ మాత్రమే ఉన్నారు. పీసీసీ చీఫ్ కామెంట్స్ ను బట్టి చూస్తే మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కు మంత్రి పదవి దక్కబోతున్నదా అనేది ఉత్కంఠ రేపుతున్నది. మైనార్టీ వర్గానికి చెందిన సీనియర్ నేత షబ్బీర్ అలి, అజ్మాతుల్లా హుస్సేన్, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ ల పేర్లు పరిశీలిస్తున్నట్లు చర్చ జరిగినా వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే వారికి అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేదు. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుందామన్నా ఇప్పట్లో ఎమ్మెల్సీ ఖాళీలేవీ లేవు. అయితే ఈ నెలలో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఓ ఎమ్మెల్సీ స్థానం భర్తీ కానున్నది. అయితే ఒప్పందంలో భాగంగా ఇది ఎంఐఎంకు దక్కబోతున్నదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్థానం నుంచి ఎంఐఎం తరఫున మైనార్టీకి అవకాశం ఇచ్చి వారిని కేబినెట్ లోకి తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.