- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారికి ఇష్టమున్న చోటే వైద్యం అందించండి.. అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం

దిశ, వెబ్‌డెస్క్: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరి స్వామి దేవస్థానంలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల(Mahashivratri Celebrations)కు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆలయ ఈవో పురేంద్ర కుమార్, అర్చకులు మంత్రిని హైదరాబాద్ సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం చేసి, అమ్మవారి తీర్థప్రసాదాలను, ఆహ్వానపత్రికను అందించారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ధ్వజారోహణం, మహా పుర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం, జోగులాంబ బాలబ్రహ్మేశ్వర్ స్వామి(Bala Brahmeswara Swamy Temple) కళ్యాణోత్సవం, మహాశివరాత్రిని పురస్కరించుకుని కళ్యాణోత్సవం, రథోత్సవం, అశ్వవాహన సేవ, అవభృదోత్సవాలను నిర్వహించనున్నట్లు ఈవో పురేంద్ర కుమార్ మంత్రికి వివరించారు. వరుస ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఈవోను ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోటు రాకూడదని మంత్రి ఆదేశించారు. దేదీప్యమానంగా బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని మంత్రి సురేఖ సూచించారు.
అంతకుముందు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని గోవర్ధనగిరిలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మరణించిన ఘటనపై మెదక్ జిల్లా ఇంఛార్జి మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి(Siddipet District Collector Manu Chaudhary)తో ఫోన్లో మాట్లాడి, దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ఉపాధి హామీ పథకం కింద నిబంధనల ప్రకారం కూలీలకు అందించాల్సిన ఆర్థిక సహాయం, ఇతర సహకారాలపై కలెక్టర్‌తో మంత్రి సురేఖ చర్చించారు. మృతులతో పాటు క్షతగాత్రులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయం, ఇతర వెసులబాట్లు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
క్షతగాత్రుల కోరిక మేరకు వారికి ఇష్టమున్న చోటే వైద్య సౌకర్యం పొందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తీవ్రంగా గాయపడి వరంగల్ జిల్లా ఎంజిఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న స్వరూప ఆరోగ్య పరిస్థితిని మంత్రి సురేఖ ఆరా తీశారు. ఎంజీఎం హాస్పిటల్ సూపరిండెంట్(Superintendent of MGM Hospital) కిశోర్‌తో ఫోన్లో మాట్లాడి ఆమెకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కుదుటపడేదాకా చికిత్సను కొనసాగించాలని ఆదేశించారు. స్వరూపకు చికిత్స కొనసాగినన్ని రోజులు ఆమె భర్తకు ఆహారం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.