స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా ఇవ్వట్లేదన్నారు: ఈటల రాజేందర్

by Gantepaka Srikanth |
స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా ఇవ్వట్లేదన్నారు: ఈటల రాజేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఆర్వోబీలు, ఆర్‌యూబీలు లేక నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోందని, వాటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడంలేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతున్నప్పుడు ఎంపీ రఘునందన్ రావు అనేక విషయాలు పార్లమెంట్ లో ప్రస్తావించారని ఈటల తెలిపారు. మాట్లాడే సమయం ఎక్కువ లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ లిఖితపూర్వకంగా ఇవ్వమని రైల్వే మంత్రి చెప్పారు, అవన్నీ ఆయనకు ఇచ్చినట్లు ఈటల వివరించారు. అయితే అనేక రైల్వే ఆస్తులకు, వర్క్ షాపులకు, రైల్వే క్వార్టర్లతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రైల్ నిలయం అన్నిటికీ కేంద్ర బిందువు మల్కాజిగిరి పార్లమెంట్ పరిస్థితి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మారిందని పేర్కొన్నారు. జిగ్ జాగ్ రైల్వే లైన్ల వల్ల తమ పార్లమెంట్ ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

బొల్లారం ఆర్‌యూబీ, వాజ్‌పేయి నగర్ ఆర్‌యూబీ, మౌలాలి ఆర్‌యూబీ, అల్వాల్, వెంకటాపూర్ లో అనేక రైల్వే లైన్లపై ఆర్‌యూబీ, ఆర్వోబీలు లేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతున్నాయని రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లినట్లు ఈటల తెలిపారు. వీటి నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేనట్టు ఉందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చేటట్లు లేదని కేంద్ర మంత్రి తెలిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రైల్వే శాఖ నుంచి 100 శాతం నిధులు కేటాయించి పనులు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఈటల తెలిపారు.రైల్వే ఆస్తులు నుంచి కాలనీలకు రోడ్డు బంద్ చేసి ఇబ్బంది పెట్టకుండా చూస్తామని రాజేందర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రూ.30 వేల కోట్ల పైచిలుకు డబ్బులతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఈటల రాజేందర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed