‘అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం’.. ఎమ్మెల్యే హరీశ్ సీరియస్

by Satheesh |
‘అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం’.. ఎమ్మెల్యే హరీశ్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పోడు భూముల సమస్య రణరంగాన్ని సృష్టిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అన్నారు. దీనివల్ల పోడు రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కేసీఆర్ కుర్చీ వేసుకొని పోడు భూముల పట్టాలు పంచుతామని చెప్పి పోడు రైతులను నిండా ముంచారని విమర్శలు చేశారు. పోడు రైతుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. 30, 40 సంవత్సరాల నుంచి పోడు భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని, అలాంటిది ఉన్నఫళంగా భూములు లాక్కుంటే రైతులు ఆగమవుతారని పేర్కొన్నారు.

పోడు రైతులపై ఫారెస్ట్ ఆఫీసర్ల దాష్టీకాలు పెరుగుతున్నాయని హరీశ్ మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారుల దాష్టీకాలకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టాలన్నారు. పోడు రైతులు సంఘటితం కావాలని, అధికారుల అరాచకాలను ఎదురుకోవాలని పాల్వాయి హరీశ్ పిలుపునిచ్చారు. పోడు రైతులకు అన్యాయం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోందని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. పోడు రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోడు రైతులను సంఘటితం చేసి పోరాటానికి సిద్ధమవుతామని ఆయన తెలిపారు. ప్రభుత్వం దుందుడుకు పోకడలు కాకుండా సమస్యను పరిష్కరించేలా ఆలోచన చేయాలని సూచించారు. అంతేకానీ.. ఉన్నపళంగా భూములు లాక్కుంటే రైతులు జీవనాధారం కోల్పోతారని పాల్వాయి హరీశ్ తెలిపారు.


Next Story