కాంగ్రెస్‌లో జోడో యాత్ర టెన్షన్... ఇంకా ఫైనల్ కాని రూట్ మ్యాప్

by Javid Pasha |   ( Updated:2022-10-02 02:39:03.0  )
కాంగ్రెస్‌లో జోడో యాత్ర టెన్షన్... ఇంకా  ఫైనల్ కాని రూట్ మ్యాప్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చేనెల రాష్ట్రంలో అడుగుపెట్టనున్న రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్రలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో 13 రోజుల పాటు జోడో యాత్ర ఉంటుందని ఇప్పటికే టీపీసీసీ ప్రకటించింది. కానీ రూట్​ మ్యాప్‌ను ఇంకా ఖరారు చేయలేదు. తాజాగా కర్ణాటకలో యాత్ర సాగుతుండగా.. తర్వాత మన స్టేట్‌లోకి రానుంది. ఈ నెల 24న కృష్ణా నుంచి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జోడో యాత్ర ప్రతినిధుల బృందం రాష్ట్ర కాంగ్రెస్​ నేతలతో సమావేశమైంది.

రాష్ట్రంలోకి యాత్ర‌ వ‌చ్చాక అన్ని మ‌తాల మ‌ధ్య ఐక్య‌తా భావాన్ని నింపేందుకు కాంగ్రెస్ ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. దీని ద్వారా బీజేపీకి చెక్​ పెట్టవచ్చని భావిస్తున్నారు. యాత్రలో భాగంగా దేవాల‌యాలు, చ‌ర్చిలు, మ‌సీదుల‌ను రాహుల్ గాంధీ సంద‌ర్శించ‌నున్నారు. మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ది. ఈ చ‌ర్య‌ల్లో భాగంగా హైద‌రాబాద్​ న‌గ‌ర శివారులో ఉన్న చిలుకూరి బాలాజీ దేవాల‌యాన్ని దర్శించుకోనున్నారు.

ఆ త‌ర్వాత ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మెద‌క్ చ‌ర్చి వెళ్ళ‌నున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి 44 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్న జ‌హంగీర్ ద‌ర్గాను కూడా సంద‌ర్శిస్తార‌ని భార‌త్ జోడో యాత్ర వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. వీటిని సంద‌ర్శించ‌డం ద్వారా బీజేపీ దేశంలో చేస్తున్న మ‌త విభ‌జ‌న రాజ‌కీయాల‌కు గట్టి సమాధానం ఇచ్చిన‌ట్టువుతుంద‌ని కాంగ్రెస్ అంచ‌నా వేస్తోంది.

రాష్ట్రంలో 13 రోజుల యాత్ర

భారత్ జోడో యాత్ర నేపథ్యంలో టీపీసీసీ నేతలతో జోడో యాత్ర ప్రతినిధులు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర తెలంగాణలో దాదాపు 13 రోజులు ఉంటుందని, తెలంగాణ తర్వాత రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందన్నారు. పాదయాత్రపై మహారాష్ట్ర నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

మహారాష్ట్ర, తెలంగాణ నేతలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని, తెలంగాణ, మహారాష్ట్రలో కామన్ సమస్యలు ఉన్నాయని, వాటిని ఎలా ఎక్స్పోజ్ చేయాలనే అంశంపై చర్చించామని రేవంత్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నాయకులం కలిసి కర్ణాటక వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తామన్నారు.

పాదయాత్రలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వంద సంవత్సరాల వరకూ మళ్ళీ ఇలాంటి యాత్ర ఉండదన్నారు. ఇది దేశ భవిష్యత్తును మార్చే పాదయాత్ర అన్నారు. కనీసం 25 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలతో మహారాష్ట్రకు రాహుల్ గాంధీని తీసుకెళ్తామని రేవంత్ తెలిపారు. దేశాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకు రావాలని, జోడో యాత్రలో అందరూ పాల్గొని మద్దతు తెలపాలన్నారు.

మహారాష్ట్ర మాజీ మంత్రి నసీం ఖాన్ మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేయడానికోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని అన్నారు. దేశాన్ని కొందరు విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని, దేశాన్ని కలపడానికి రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్నదమ్ముల్లాంటి వారని, రాహుల్ పాదయాత్ర కోసం మహారాష్ట్ర ఎదురుచూస్తోందన్నారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ నేతలు కలిశారు. రాహుల్‌ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌‌కు నేతలు అనుమతి కోరారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని శక్తులను ఏకం చేసే యాత్రగా పేర్కొన్నారు.

Also Read: రిజర్వేషన్లపై కేసీఆర్ వ్యూహం ఫలించేనా..? ఆ అంశంపై నో క్లారిటీ

Advertisement

Next Story

Most Viewed