మతిభ్రమించి మాట్లాడుతున్న కేశవరావు : మాజీ ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-04-01 16:41:56.0  )
మతిభ్రమించి మాట్లాడుతున్న కేశవరావు : మాజీ ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంపీ కేశవరావుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫైర్ అయ్యారు. మతిభ్రమించి బీఆర్ఎస్‌పై మాట్లాడుతున్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణ బ్రతుకుల మీద విషం చిమ్ముతోందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే.. తెలంగాణ ద్రోహి అని ఉద్యమంలో చెప్పులతో కొట్టారని అన్నారు. మిలియన్ మార్చ్‌లో కేశవరావును కొడిగుడ్లతో కొట్టిన ఘటనలను గుర్తు చేసుకోవాలని సూచించారు.

ఇవాళ పాట లేదు.. మాట లేదని కేశవరావు మాట్లాడుతున్నారని, ఆయన భాష ఎవరికీ అర్థం కాదన్నారు. పాటకు చరిత్ర లేకపోతే జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతిని అవమానించడం సరైంది కాదని కేశవరావు‌కు సూచించారు. ఓట్ల కోసం గద్దర్‌ను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని దుయ్యబట్టారు. కేశవరావు వెంటనే కళాకారులకు క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆయన ఇంటి ముందు దూంధాం నిర్వహిస్తామని హెచ్చరించారు.

కడియం శ్రీహరి మాదిగ ద్రోహి, మాదిగ జాతి అంటే ఆయనకు కల్లమంట అన్నారు. కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం లేకున్నా ఆమె‌కు కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చారని అన్నారు. ఆమె కేసీఆర్‌ను విమర్శించడం నైతికతకు నిదర్శనని తెలిపారు. శ్రీహరి ఏ బడి‌లో చదువుకున్నాడో, ఎక్కడ బడి చెప్పిండో ఎవరికీ తెలియదని అన్నారు. తెలంగాణ ద్రోహి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర కడియంది అని అన్నారు. మాదిగ జాతిని మొత్తాన్ని నిర్వీర్యం చేసిన ఘనత కడియం‌కే దక్కిందన్నారు. శ్రీహరి వైఖరితోనే తాడికొండ రాజయ్య, ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారన్నారు. మాదిగ జాతి ఎవరు కాంగ్రెస్ పార్టీకీ ఓటు వేయొద్దని కోరారు.

కాంగ్రెస్ మాదిగలకు సీటు ఇవ్వకపోతే చావు డప్పు కొడుతామని హెచ్చరించారు. వరంగల్‌లో కడియం శ్రీహరి‌పై చావు డప్పు కొడతామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వందశాతం కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ముసలి నక్కలు అన్ని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాయని అన్నారు. మాదిగలకు ద్రోహం చేసిన కడియంను కచ్చితంగా ఒడిస్తాం.. ఓడగొట్టి పాతి పెట్టే వరకు రసమయి బాలకిషన్ కాలుకు గజ్జెకట్టి ఆడి, పాడుతాడని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను వరంగల్ నుంచి పోటీ‌కి సిద్ధమని ప్రకటించారు. బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగ ఓట్లు కోసం తాపత్రయ పడుతోందని, కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఎన్ని సీట్లు ఇచ్చారో మందకృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టుల గేట్లు తెరవమంటే పార్టీ గేట్లు తెరుస్తున్నాడని దుయ్యబట్టారు.

Advertisement

Next Story