పార్టీ నిర్మాణంపై KCR ఫోకస్ నిల్.. BRSకు పుర్వవైభవం కష్టమేనా..?

by Sathputhe Rajesh |
పార్టీ నిర్మాణంపై KCR ఫోకస్ నిల్.. BRSకు పుర్వవైభవం కష్టమేనా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తామని అధిష్టానం పదేపదే చెబుతున్నా ఆ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. పార్టీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పూర్తిస్థాయి కమిటీలు లేవు.. జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించినా కేడర్‌కు శిక్షణ కార్యక్రమాలు చేపట్ట లేదు. దీంతో పార్టీ కార్యాలయాలన్నీ నిరూపయోగంగానే మారాయని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని 2001లో స్థాపించారు. నాటి నుంచి 2014వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని కొనసాగించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చింది. కానీ ఏనాడూ కూడా పార్టీ కేడర్ కు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదని పార్టీ నేతలే పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చినవారు... పార్టీలో ఉన్నవారితో కలిసి గ్రామస్థాయిలో బలంగా ఉన్నామని చెప్పారు. రెండేళ్ల క్రితం పార్టీ సభ్యత్వాలు సైతం చేసి అత్యధిక సభ్యత్వాలు ఉన్నపార్టీ బీఆర్ఎస్ అని పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.

కానీ పార్టీ పటిష్టతపై మాత్రం దృష్టిసారించలేదు. గ్రామశాఖ అధ్యక్షుడిని మాత్రమే నియమించి పూర్తి స్థాయి కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను సైతం నియమించలేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అన్ని గ్రామాల్లో కమిటీలు వేయాలని, సోషల్ మీడియా కమిటీని సైతం నియమించి యాక్టీవ్ గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆదిశగా చర్యలు చేపట్టలేదని సమాచారం. అదే విధంగా మండల, నియోజకవర్గ కమిటీలు కూడా లేవు. అదే విధంగా జిల్లా కమిటీ అధ్యక్షులను మాత్రమే నియమించారు. పూర్తి జిల్లా కమిటీలతో పాటు అనుబంధసంఘాల కమిటీలు వేయలేదు. గతంలో వేసిన కమిటీలే ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు గ్రామస్థాయి నుంచి పార్టీలో గ్రూపులు ఉన్నాయి. ఎమ్మెల్యేకు అనుకూలంగా, మొదటి నుంచి పనిచేస్తున్న వారు మరోవర్గంగా ఉన్నారు. ఎమ్మెల్యే అనుకూలవర్గానికే గ్రామకమిటీ అధ్యక్షుడిగా నియమించడంతో మిగతావారంతా గుర్రుగా ఉండటంతో కొన్ని కమిటీలను వేయలేదని సమాచారం. ఇదే పరిస్థితి నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కొనసాగుతోంది. ఆ గ్రూపులే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

రాష్ట్ర కమిటీలోనూ ఖాళీలే...

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నూతన రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు ప్రారంభించినప్పటికీ ఎవరికైనా కమిటీలో అవకాశం రాకపోతే వ్యతిరేకత వస్తుందని భావించి వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో 67 మంది సభ్యులతో జంబో కమిటీ ఉంది. ఆ కమిటీలో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక సీనియర్ నేతలకు మాత్రమే అవకాశం కల్పించారు. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడితో సహా 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సంయుక్త కార్యదర్శులున్నారు. ఆ కమిటీలో సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన కేకే పార్టీ మారారు. సీనియర్ నేతలు మంద జగన్నాధం, కడియం శ్రీహరి, మధన్ రెడ్డి, పి.రాములు, బీబీపాటిల్, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇలా పలువురు రాష్ట్రకమిటీలో ఉండగా ప్రస్తుతం వారంతా పార్టీ మారారు. వీరి పోస్టులు ఖాళీ అయ్యాయి. నూతనంగా కమిటీని వేస్తే తమకు చోటుదక్కుతుందని పలువురు ఆశిస్తున్నారు. కానీ ఆదిశగా చర్యలు చేపడుతారో... లేదో చూడాలి.

నిరుపయోగంగా పార్టీ కార్యాలయాలు

పార్టీ కేడర్‌ను ఎప్పటికప్పుడు యాక్టీవ్ చేసేందుకు పార్టీ అధిష్టానం అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించింది. నియోజకవర్గాల వారీగా నేతలకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొంది. నిర్మించిన కార్యాలయాలు నిరూపయోగంగా మారాయి. శిక్షణ మాటలకే పరిమితం అయింది. పార్టీ కేడర్‌కు మార్గనిర్దేశం చేసే నాయకుడే కరువయ్యారని, పార్టీ ఏం చేపడుతుందో అర్ధం కావడం లేదని, మనోధైర్యం నింపే పార్టీ నేత కరువయ్యారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ సన్నాహక సమావేశాలు కూడా పార్టీ కార్యాలయాల్లో కాకుండా ఫంక్షన్ హాళ్లలో నిర్వహిస్తుండటం శోఛనీయం.

పునర్ నిర్మాణంపై దృష్టిసారించకపోతే కష్టమే?

కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ నిర్మాణంపై దృష్టిసారించలేదు. గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయలేదు. దీంతో అధికారం కోల్పోగానే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలంతా ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారు. దీంతో గ్రామస్థాయిలో పార్టీ ఖాళీ అవుతుంది. దీనిని నివారించేందుకు గ్రామస్థాయి నుంచి కమిటీలు, అనుబంధ కమిటీలు వేసి, శిక్షణ కార్యక్రమాలు చేపడితేనే పార్టీ బలోపేతంతో పాటు పునర్ నిర్మాణం జరిగి పార్టీ మనుగడ ఉంటుందని, లేకుంటే కష్టమేనని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ పటిష్టతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed