విషాదాన్ని మాటల్లో చెప్పలేము..రఫాలో ఇజ్రాయెల్ దాడులపై యూఎన్ఓ ఆందోళన

by samatah |
విషాదాన్ని మాటల్లో చెప్పలేము..రఫాలో ఇజ్రాయెల్ దాడులపై యూఎన్ఓ ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని రఫా నగరంపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి స్పందించింది. రఫాపై దాడులు తీవ్ర విషాదానికి దారి తీస్తాయని, దానిని వర్ణించడానికి పదాలు కూడా లేకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేసింది. రఫాపై ఇజ్రాయెల్ తప్పకుండా దాడి చేస్తుందని దీని వల్ల దక్షిణ గాజాలో ఉన్న 1.2మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అటాక్స్‌ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు తమ శక్తి మేర కృషి చేయాలని యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ విజ్ఞప్తి చేశారు.

ఉత్తర గాజాలోనూ పరిస్థితి తీవ్రంగా ఉందని, దానిని నివారించడానికి మానవతా సాయం అందించడంలో కాస్త పురోగతి ఉందని తెలిపారు. ఈ సాయాన్ని మరింత మెరుగు పర్చాలని సూచించారు. మానవతా సాయం అందించేందుకు రెండు క్రాసింగ్‌లను తెరుస్తామని ఇచ్చిన మాటను ఇజ్రాయెల్ నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ‘గాజాలో సహాయం అందించే మానవతా వాదులకు, వ్యక్తులకు, సంస్థలకు భద్రత లేకపోవడంతో సహాయానికి ప్రధాన అడ్డంకిగా మారింది. కాబట్టి సహాయం అందించే సంస్థలను లక్ష్యంగా చేసుకోకూడదు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు గాజాలోకి సహాయాన్ని పెంచేందుకు ఇజ్రాయెల్ తీసుకోవాల్సిన చర్యలపై నెతన్యాహుతో బుధవారం చర్చిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.

కాగా, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రఫా నగరంపై దాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. దాడుల తోనే ముందుకు సాగుతామని, విజయం సాధించే వరకు వెనుకాడబోమని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి స్పందించింది. మరోవైపు గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 34,535కు చేరుకున్నట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో రఫాపై దాడి చేస్తే భారీగా మరణాలు సంభవించే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed