అభ్యర్థులతో కేసీఆర్ మీటింగ్..! ఆ అంశంపైనే ఫోకస్?

by Anjali |   ( Updated:2023-08-23 01:54:17.0  )
అభ్యర్థులతో కేసీఆర్ మీటింగ్..! ఆ అంశంపైనే ఫోకస్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చేవారం అసెంబ్లీ అభ్యర్థులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఏం చేయాలి? వచ్చాక రూట్ మ్యాప్ ఏంటి? అనే అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. మెజార్టీ అభ్యర్థుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, మరోవైపు సొంత పార్టీ లీడర్ల నుంచి సహాయ నిరాకరణ సమస్య ఎదురయ్యే చాన్స్ ఉన్నట్టు నిఘా వర్గాలు రిపోర్టు ఇచ్చాయి. ఈ సమస్యలను ఎలా అధిగమించాలో కేసీఆర్ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మీటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది.

ఈనెల 28న మీటింగ్?

తొలి జాబితాలో 115 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ ఈనెల 28న తెలంగాణ భవన్ లో వారందరితో తొలిసారి సమావేశం అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే ఈ మీటింగ్ లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వివరించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ప్రభుత్వ పరంగా, వచ్చిన తర్వాత పార్టీ పరంగా చేయాల్సిన పనుల జాబితాను అందించనున్నట్టు తెలిసింది. అలాగే ఏ సెగ్మెంట్లలో కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ ఉంటుందో అలర్ట్ చేసి, ఆ పార్టీలను ఏ విధంగా ఎదుర్కోవాలో సూచించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఫ్యామిలీ డీటెయిల్స్ అందించి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని అభ్యర్థులను ఆదేశించనున్నట్టు సమాచారం.

అసమ్మతిపై కౌన్సెలింగ్..

ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేయాలి? కేడర్ ను ఎలా చూసుకోవాలో చిట్కాలు ఇవ్వనున్నారు. లోకల్ లీడర్లు అభ్యర్థులపై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున ఆఫర్లు ఇస్తారని అంచనా వేస్తున్నారు. వాటిని ఎలా ఫేస్ చేయాలో కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు తెలిసింది. చాలామంది అభ్యర్థులకు అసమ్మతి సమస్య పెద్ద సవాలుగా మారనుంది. వ్యతిరేకించే లీడర్లను మచ్చిక చేసుకునేందుకు పలు సూచనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చేవారం నుంచే అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లేందుకు క్యాలెండర్ ఇవ్వనున్నట్టు తెలిపాయి.

Advertisement

Next Story