పరిపాలనపై కేసీఆర్ నెగ్లీజియెన్స్.. సీఎం దృష్టి అంతా ఆ ఒక్క దానిపైనే..!

by Satheesh |   ( Updated:2023-03-17 06:28:11.0  )
పరిపాలనపై కేసీఆర్ నెగ్లీజియెన్స్.. సీఎం దృష్టి అంతా ఆ ఒక్క దానిపైనే..!
X

ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాలనా విషయాలనూ గాలికొదిలేసింది. అకాల వర్షాలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఇంటర్ స్టూడెంట్స్ ఆత్మహత్యలు, ర్యాగింగులు.. ఇలా ఏది జరిగినా సీఎం, మంత్రులు స్పందించడం లేదు. కేవలం ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణపై మాత్రమే అందరూ ఫోకస్ పెట్టారు. ఆమెకు బాసటగా కొందరు మినిస్టర్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సమస్యలు పట్టించుకోవాల్సిన పాలకులు కవితను సపోర్ట్ చేయడానికే పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీలో జరిగిన పేపర్ లీకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. బోర్డు అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు సర్వీస్ కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షలపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లీకేజీపై పెద్ద ఎత్తున నిరససలు వ్యక్తమవుతున్నా.. సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదు. సర్వీస్ కమిషన్‌లో ఏం జరుగుతుందోనని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. మంత్రులు కూడా తమకు సంబంధం లేదని స్పందించడానికి భయపడుతున్నారు.

అకాల వర్షాలపై సమీక్ష ఏదీ..?

అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఆదుకోవాలని మామిడి, వరి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలపై ప్రజలను అలర్ట్ చేయాల్సిన సర్కారు మౌనంగా ఉండిపోయిందనే విమర్శలున్నాయి.

ప్రీతి మరణంపై..

మెడికో ప్రీతి మృతిపై ఇప్పటికీ అనుమానాలున్నాయి. ఆమె మరణానికి గల కారణాలు బహిర్గతం చేయాలనే డిమాండ్ ఉన్నది. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మంత్రులు మొదట్లో చొరవ చూపలేదు. తీవ్ర విమర్శలు రావడంతోనే ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారనే చర్చ జరుగుతున్నది.

స్టూడెంట్స్ సూసైడ్స్‌పై కదలిక లేదు

ఒత్తిడి భరించలేక పక్షం రోజుల క్రితం కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులు వరుసగా బలవన్మరణాలకు పాల్పడ్డారు. దీనిపై ప్రభుత్వం కనీసం స్పందించలేదు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న బోధనా తీరుపై తనిఖీలు జరపలేదు. గతంలో ప్రతి ఏటా ఇంటర్ హాల్ టికెట్స్ ఆన్‌లైన్‌లో పెట్టేవారు. ఈసారి మాత్రం కాలేజీ మేనేజ్‌మెంట్లకు నేరుగా పంపారు. దీంతో ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్స్ ఇస్తామని యాజమాన్యం స్టూడెంట్స్‌ను ఇబ్బంది పెట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల తీరుపై వేలాది ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

Read more:

బిగ్ న్యూస్: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. గులాబీ బాస్‌ను ఊహించని దెబ్బ కొట్టిన ‘‘టీచర్స్’

Advertisement

Next Story

Most Viewed