ఏ క్షణమైనా కేంద్ర సంస్థల దాడి.. అన్నింటికీ ప్రిపేర్డ్‌గా ఉండండి: KCR

by GSrikanth |   ( Updated:2022-09-03 15:26:38.0  )
ఏ క్షణమైనా కేంద్ర సంస్థల దాడి.. అన్నింటికీ ప్రిపేర్డ్‌గా ఉండండి: KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏ క్షణమైనా దాడికి పాల్పడే అవకాశం ఉన్నదని, మునుపెన్నటి కంటే అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను పార్టీ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ లాంటి పార్టీల విషయంలో ఇదే జరిగిందని, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీపైన ఇదే ప్రయోగిస్తుందని అలర్టు చేశారు. దర్యాప్తు సంస్థలకు అవకాశమిచ్చే ఏ పనులూ చేయొద్దన్నారు. బీజేపీ బెదిరిఫులను పట్టించుకోవద్దని, ఆ పార్టీ మనల్ని ఏమీ చేయలేదని భరోసా నింపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసినట్లు ఇక్కడ నడవదని చెప్తూనే నాన్ సీరియస్‌గా ఉండొద్దని, అన్నింటికీ ప్రిపేర్డ్‌గా ఉండాలన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని, మహారాష్ట్రలో బీజేపీ పాచికలు పనిచేసినా ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల్లో ఫెయిల్ అయిందని కేసీఆర్ గుర్తుచేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అనవసరంగా ఇష్యూ చేస్తున్నాయని, సీబీఐతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నదని, ఇకపైన మీ వద్దకు (ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి) కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని, బెదిరింపులకు పాల్పడుతారన్నారు. మహారాష్ట్ర తరహాలో శివసేన పార్టీని సంక్షోభంలోకి నెట్టిన తీరులో తెలంగాణలోనూ మన పార్టీపై అదే పాచికను ప్రయోగించే ప్రయత్నాలు జరుగుతాయని, కానీ మన నాయకులు నిజాయితీగా ఉన్నారని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐకి భయపడాల్సిన పని లేదని, బీజేపీ మనల్ని ఏమీ చేయలేదని నైతిక స్థయిర్యం కల్పించారు.

అవసరమైతే న్యాయపోరాటం చేద్దామన్నారు. రానున్న కాలంలో కేంద్రమంత్రుల దండయాత్ర తెలంగాణపై మరింతగా పెరుగుతుందని, ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని సూచించారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే బీజేపీ ఈ కుట్రలకు పాల్పడుతున్నదని, కానీ మనం అవకాశం ఇవ్వనంతవరకు ఏ భయమూ అవసరం లేదన్నారు.

మునుగోడులో గెలుపు మనదే

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక గురించి కేసీఆర్ ప్రస్తావిస్తూ, మనమే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని, గెలుపు మనదేనని స్పష్టం చేశారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని నొక్కిచెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతీ రెండు గ్రామాలకు ఒక్కో ఎమ్మెల్యేను ఇన్‌చార్జిగా పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి, పటిష్టంగా ఉంచుకోడానికి కార్యకర్తల మొదలు ఇన్‌చార్జి వరకు కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రతీ ప్రజా ప్రతినిధి రోజువారీగా బేరీజు వేసుకోవాలని, మునుగోడులో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్ని పసిగట్టాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అందరితో కలిసి పనిచేయాలని, సర్వే ఫలితాలను విశ్లేషించుకుని తదనుగుణమైన కార్యాచరణను చేపట్టాలన్నారు.

ప్రజలతో కలిసిపోతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి ద్వారా కలుగుతున్న లబ్దిని వారికి అర్థమయ్యే తీరులో వివరించాలని, కొత్తగా జాబితాలో చేరిన ఆసరా పింఛనుదారులకు స్వయంగా ఆ లబ్ధిని మీరే ఇవ్వండి, వారితో భోజనం కూడా చేయండి, అవసరమైతే వన భోజనాల ఏర్పాట్లు కూడా చేయండి అంటూ సూచనలు చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు మనవేనని, మరోమారు అధికారంలోకి వస్తున్నామని ధైర్యం కల్పించారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

సీఆర్‌తో CPM నేతల భేటీ.. చర్చకొచ్చిన అంశాలు ఇవే

మునుగోడు ఉప ఎన్నికపై KCR సంచలన వ్యాఖ్యలు

NTR vs KCR.. మధ్యలోకి దూరిన కళ్యాణ్ రామ్?

Advertisement

Next Story

Most Viewed