కేజ్రీవాల్ తో నేరుగా టచ్ లో కవిత.. లిక్కర్ పాలసీ కేసులో స్క్రీన్ షాట్‌లను కోర్టుకు సమర్పించిన ఈడీ

by Prasad Jukanti |   ( Updated:2024-04-24 12:28:35.0  )
కేజ్రీవాల్ తో నేరుగా టచ్ లో కవిత.. లిక్కర్ పాలసీ కేసులో స్క్రీన్ షాట్‌లను కోర్టుకు సమర్పించిన ఈడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఆఫీసర్లు అరెస్టు చేసి తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచగా ఆమెకు బెయిల్ ఇవ్వవద్దంటూ రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జికి విజ్ఞప్తి చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని వాదిస్తూ అనేక అంశాలను లాయర్ జోయబ్ హుస్సేన్ వివరించారు. కొన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈడీ వాదనలు ఈ సాయంత్రం కంప్లీట్ అయ్యాయి. వరుసగా మూడు రోజుల పాటు ఈడీ తన వాదనలను వినిపించింది. చివరకు కవితకు బెయిల్ ఇచ్చే అంశాన్ని ఈ నెల 6న వెల్లడిస్తామని పేర్కొన్న స్పెషల్ జడ్జి కావేరి భవేజా తీర్పును రిజర్వులో ఉంచారు. ఈడీ వాదనలకు రాతపూర్వకంగానే రీజాయిండర్‌ను కోర్టుకు సమర్పిస్తామని కవిత తరఫు న్యాయవాది రాణా తెలిపారు. లిక్కర్ వ్యవహారంలో కవితకు వ్యతిరేకంగా ఈడీ బలమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న ఈడీ న్యాయవాది హుస్సేన్.. పాలసీ రూపకల్పనలో కవిత కీ రోల్ పోషించారని, ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూపు నుంచి వెళ్లిన రూ.100 కోట్లలో రూ. 25 కోట్లను మాగుంట రాఘవ నుంచి వసూలు చేశారని వాదించారు. పాలసీ ఫైనల్ కావడానికి ముందే డ్రాఫ్ట్ కాపీ కవితకు చేరిందని, అనుకూలంగా ఉండే నిబంధనలు ఉండేలా ఆమె చొరవ తీసుకున్నారని, దీనికి సంబంధించి వాట్సాప్ చాటింగ్‌ కూడా జరిగిందంటూ కొన్ని స్క్రీన్ షాట్‌లను కోర్టుకు అందజేశారు. విచారణకు హాజరుకావడానికి నోటీసులు ఇచ్చేటప్పుడే మొబైల్ ఫోన్లను డిజిటల్ ఎవిడెన్సు కోసం తీసుకురావాల్సిందిగా చెప్పినా వాటిని ఉద్దేశపూర్వకంగానే ఫార్మాట్ చేసి ఇచ్చారని ఆయన ఆరోపించారు.

ఎక్సయిజ్ పాలసీలో కవిత నేరుగా కేజ్రీవాల్‌తోనే టచ్‌లో ఉన్నారని, సౌత్ గ్రూపులో యాక్టివ్‌గా ఉన్న మాగుంట రాఘవ కూడా తన స్టేట్‌మెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారని హుస్సేన్ తెలిపారు. మనీలాండరింగ్ కేసులో అనేక మంది నిందితులకు ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ తిరస్కరించాయని, మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌లోనూ దే జరిగిందని ఈడీ న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసులో ఒక చార్జ్ షీట్ సహా 5 సప్లిమెంటరీ చార్జ్ షీట్లు దాఖలు చేశామన్నారు. అన్ని చార్జిషీట్లనూ కోర్టు పరిగణనలోకి తీసుకున్నదని గుర్తుచేశారు. లిక్కర్ పాలసీలో వ్యాపారులకు ఇచ్చే కమిషన్ రేట్లు పెంచడం ద్వారా హోల్‌సేల్ వ్యాపారులకు రూ. 338 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసులు లేకుండానే మద్యం విధానం ద్వారా కమిషన్ రేట్లు 5% నుంచి 12% మేర ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ పెంచిందని, దీంతో హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న ఇండో స్పిరిట్స్ కంపెనీ రూ. 192 కోట్లు లాభం పొందిందన్నారు. ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఇండో స్పిరిట్స్ ప్రధాన హోల్ సెల్లర్‌గా ఉందన్నారు. ఈ కంపెనీలో కవిత భాగస్వామిగా ఉన్నారని, లిక్కర్ వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా కమిషన్ రేట్లు పెంచేలా చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరగడంతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని, ఇండో స్పిరిట్స్ ఎక్కువగా లాభపడిందన్నారు. పాలసీ రూపకల్పనలో తప్పు జరిగినట్లు సుప్రీంకోర్టు కూడా నిర్దారించిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీవైపు నుంచి విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా సౌత్ గ్రూపునకు చెందిన బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై వ్యవహారాన్ని నడిపారని, మద్యం వ్యాపారులతో సమావేశాలు జరిగాయని, చివరకు అసాధారణ లాభాలు పొందారని తెలిపారు.

మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కోసం తొలుత మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలిశారని, దక్షిణాది నుంచి కొందరు మద్యం వ్యాపారులు ఆసక్తిగా ఉన్నారని చెప్పిన తర్వాత తనను రూ. 100 కోట్లు అడిగారని, కవితను కలవాల్సిందిగా ఆయనకు కేజ్రీవాల్ సూచించారని ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. రూ. 100 కోట్ల ముడుపుల్లో రూ. 50 కోట్లు సమకూర్చాలంటూ శ్రీనివాసులు రెడ్డిని కవిత కోరారని, చివరకు ఆయన కొడుకు మాగుంట రాఘవ రెండు విడతల్లో రూ. 25 కోట్లను అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబుకు ఇచ్చారని తెలిపారు. దీనికి ప్రతిఫలంగా ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత పార్టనర్ అయ్యారని, ఈ విషయాన్ని మాగుంట రాఘవ తన స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేశారని తెలిపారు. అరబిందో ఫార్మా శరత్‌చంద్రారెడ్డి సైతం అమాయకుడేమీ కాదని పేర్కొన్న ఈడీ... కవితతో భేటీ అయ్యారని తెలిపారు. కొంతమేరకు ముడుపులు ఇవ్వడానికి ఆయనా సిద్ధపడ్డారని అన్నారు.

మద్యం బిజినెస్‌లో కవితకు 33% వాటా కోసం ఆడిటర్ బుచ్చిబాబు పని చేసారని తెలిపారు. మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారిన తర్వాత సాక్ష్యాలను ధ్రువీకరించారని, పాలసీని అనుకూలంగా మార్చేందుకే లంచాలు ఇచ్చినట్లు తన స్టేట్‌మెంట్‌లో చెప్పారని తెలిపారు. కోర్టు అనుమతితోనే పలువురు నిందితులు అప్రూవర్లుగా మారారని, ఇప్పుడు వారిని అనుమానించడమంటే కోర్టు నిర్ణయాన్ని తప్పపట్టడమేనని అన్నారు. శరత్‌చంద్రారెడ్డి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళం ఇచ్చిన అంశం ఈ వాదనల సందర్భంగా కోర్టుకు దృష్టికి రాగా ఈడీ న్యాయవాది జోక్యం చేసుకుని... ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు... ఎవరు ఏ పార్టీకి ఎలాక్టోరల్ బాండ్లు ఇచ్చారు... ఈవేవీ ఈ కేసులో అవసరం లేని అంశాలని వ్యాఖ్యానించారు.

కవితకి తాను ప్రాక్సీ అంటూ అరుణ్ రామచంద్రన్ పిళ్ళై కూడా స్టేట్‌మెంట్‌లో చెప్పారని, కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆమె ఒత్తిడి మేరకు ఆయన ఆ స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నారని ఈడీ తరఫు న్యాయవాది గుర్తుచేశారు. కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య అవగాహన ఉందన్న అంవాన్ని బుచ్చిబాబు కూడా స్టేట్‌మెంట్‌లో చెప్పారని, విజయ్ నాయర్‌తో కలిసి మద్యం విధానంలో అనుకూలమైన నిబంధనలు చేరాయన్నారు. తొలుత డ్రాఫ్ట్ కాపీని బుచ్చిబాబుకి పంపింది విజయ్‌నాయరేనని, కవిత చెప్పిన అంశాలే ఆ పాలసీలో పొందుపర్చినట్లు తెలిపారు. అరుణ్ పిళ్ళై ద్వారానే కవిత మద్యం వ్యాపారంలో భాగస్వామి అయ్యారన్నారు. శరత్ రెడ్డి అమాయకుడు కాదని, ఐదు రీటెయిల్ జోన్లు పొంది వ్యాపారంలో ప్రధాన లబ్దిదారుడిగా ఉన్నారని తెలిపారు.

బుచ్చిబాబును అరెస్ట్ చేయలేదంటూ కవిత తరపు న్యాయవాది వాదనల్లో నిజం లేదని, బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసిందని తెలిపారు. ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడే జైలు సూపరింటెండెంట్ సమక్షంలో స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసిందన్నారు. కవిత బంధువు మేకా శరన్‌ను ఇండో స్పిరిట్ కంపెనీలో ఉద్యోగి అయ్యారని, ఒక్కరోజు కూడా హాజరుకాకున్నా నెలకు లక్ష రూపాయలు జీతం తీసుకున్నారని తెలిపారు. విచారణకు పిలిచినా ఏడెనిమిది రోజులపాటు హాజరుకాలేదన్నారు. కవిత ఇచ్చిన పది ఫోన్లలోని సమాచారాన్ని డిలీట్ చేశారని, నాలుగింటిని ఫార్మాట్ చేశారని, ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆమెను ప్రశ్నించినా సమాధానం రాలేదన్నారు. కవిత బెయిల్ పిటిషన్‌పై పలు సీరియస్ ఆరోపణలు చేసి ఈడీ చేసిన వాదనలకు రీజాయిండర్‌ను రాతపూర్వకంగా ఇస్తామని కవిత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ నెల 6న ఆమెకు బెయిల్ ఇచ్చే విషయమై స్పెషల్ జడ్జి తీర్పును ఇవ్వనున్నారు.

Read More : లిక్కర్ కేసులో కవితపై ఈడీ మరిన్ని సంచలన ఆరోపణలు

Advertisement

Next Story

Most Viewed