ముంబై రంజీ జట్టుకు యశస్వి జైస్వాల్ గుడ్ బై

by Ajay kumar |   ( Updated:2025-04-03 05:45:07.0  )
ముంబై రంజీ జట్టుకు యశస్వి జైస్వాల్ గుడ్ బై
X

- గోవాకు మారనున్న ఓపెనర్

- 2025-26 సీజన్‌లో గోవాకు కెప్టెన్‌గా జైస్వాల్

దిశ, స్పోర్ట్స్: ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ ముంబై రంజీ జట్టుకు గుడ్ బై చెప్పాడు. ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు జట్టును వీడేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసినట్లు తెలిసింది. అండర్ 19 రోజుల నుంచి ముంబై జట్టుతో కొనసాగుతున్న యశస్వి జైస్వాల్.. కెరీర్‌లో మరింత అభివృద్ధి కోసమే గోవా జట్టులో చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే గోవా క్రికెట్ అసోసియేషన్ యశస్వి జైస్వాల్‌కు 2025-26 సీజన్‌లో కెప్టెన్‌గా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే యశస్వి ముంబై నుంచి గోవాకు షిఫ్ట్ అవుతున్నట్లు సమాచారం. దేశవాళీ క్రికెట్‌లో ఏదైనా జట్టుకు కెప్టెన్‌గా ఉండాలనే తన ఆశ నెరవేరుతున్నందునే గోవాకు వెళ్తున్నట్లు జైస్వాల్ కామెంట్ చేశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) ఇస్తే.. జైస్వాల్ గోవా జట్టులో చేరడానికి మార్గం సుగమం కానుంది. జైస్వాల్ ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు ధృవీకరించాయి. అంతర్జాతీయ క్రికెట్ ఆడని సమయంలో యశస్వి జైస్వాల్ గోవా క్రికెట్ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.

'గోవా నాకు మంచి అవకాశం ఇచ్చింది. జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగిస్తామని మాట ఇచ్చింది. ఇండియాకు ప్రాతినిథ్యం వహించడం నా మొదటి కర్తవ్యం. నేషనల్ డ్యూటీలో లేని సమయంలో గోవాకు అందుబాటులో ఉంటాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాను' అని జైస్వాల్ వ్యాఖ్యానించాడు. ఇది నాకు కష్టమైన నిర్ణయమే. ఇవ్వాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముంబై కారణం. ఈ నగరం నాకు నన్ను కొత్తగా పరిచయం చేసింది. నేను ఎంసీఏకు ఎంతో రుణపడి ఉన్నానని జైస్వాల్ చెప్పాడు. జైస్వాల్ కంటే ముందు ముంబై రంజీ ప్లేయర్లు అర్జున్ టెండుల్కర్, సిద్దేశ్ లాడ్ కూడా ఆ జట్టును వీడి ప్రస్తుతం గోవా తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Next Story

Most Viewed