- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేంద్రంపై జంగ్‌కు రెడీ అవుతోన్న కాంగ్రెస్.. పార్టీ శ్రేణులకు ఏఐసీసీ చీఫ్ కీలక పిలుపు

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నది. సామాజిక, ఆర్థిక న్యాయం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సూచించారు. ఆయన ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణపై సేవ్ కానిస్టిట్యూషన్ పేరిట ర్యాలీలు చేపట్టనున్నారు. తెలంగాణలోనూ వీటిని నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఇంటింటికి కాంగ్రెస్ పేరిట కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ‘జై బాపు.. జై భీమ్.. జైసంవిధాన్’ విజయవంతంగా కొనసాగుతున్నది. నేషనల్ హెరాల్డ్ కేసులోనూ సోమవారం నుంచి ఈనెల 24 వరకు పార్టీ సీనియర్లు మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు.
సేవ్ కానిస్టిట్యూషన్ ర్యాలీలు.
రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ ఆధర్యంలో రాజ్యాంగ పరిరక్షణపై ప్రజలను చైతన్య పరిచేలా సేవ్ కానిస్టిట్యూషన్ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈనెల 25 నుంచి మే 30 వరకు స్పెషల్ప్రోగ్రామ్స్ తో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ముఖ్యంగా దేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నదని, పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ప్రజలకు వివరించనున్నారు. అలాగే, రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ, గౌరవిస్తూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేస్తూ తమ ఆధీనంలోకి తీసుకొని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్న విధానాలను ఎండగట్టి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడూ చేపట్టని తరహాలో సేవ్కాన్స్టిట్యూషన్ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా..
జిల్లా స్థాయిలో సైతం రాజ్యాంగ పరిరక్షణపై ప్రజలను చైతన్య పరిచేలా మే 3 నుంచి 10 వరకు సేవ్ కానిస్టిట్యూషన్ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా స్థాయిలో నేతలు మమేకమై పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అధేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ర్యాలీలు చేపట్టనున్నారు. తద్వారా ఊరు–వాడలోని ప్రజలకు రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లనుంది.
ఇంటింటా కాంగ్రెస్..
మే 20 నుంచి 30 వరకు ఇంటింటా కాంగ్రెస్ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి పార్టీ సిద్ధమైంది. పార్టీ నేతలు, నాయకులు, శ్రేణులు ప్రతి ఇంటికి తిరిగి ప్రస్తుతానికి ఈ దేశంలో కొనసాగిస్తున్న బీజేపీ అరాచక పాలన గురించి తెలియజేయనున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే ఏరకంగా అక్రమ కేసులు బనాయించి బెదిరిస్తున్నారో వంటి విషయాలతోపాటుగా దేశవ్యాప్తంగా కులగణన డిమాండ్ ను ప్రజలకు వివరించనున్నారు.
కొనసాగుతున్న ‘జై బాపు.. జై భీమ్.. జైసంవిధాన్’
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ‘జై బాపు.. జై భీమ్.. జైసంవిధాన్’ పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇప్పటికే టీపీసీసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాయి. దాదాపు 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, నాయకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు, వివక్షలు తొలగి, సామాజిక న్యాయం, శాంతి సంక్షేమాలు కాపాడాల్సిన రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేతలు పిలుపునిస్తున్నారు.
నేటి నుంచి మీడియా సమావేశాలు
దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా, రాజీవ్ గాంధీల కుటుంబంపై మోడీ ప్రభుత్వం విషం చిమ్ముతూ సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జి షీట్ లో దాఖలు చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే నేటి నుంచి ఈనెల 24వ తేదీ వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్లు మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. మోడీ అధికార అహంకారంతో ప్రభుత్వ సంస్థలను నాశనం చేస్తూ స్వయం ప్రతిపత్తి గల సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.