నేషనల్ హైవేను మించి ధర.. జిల్లా సరిహద్దుల్లో దర్జాగా టోల్ దందా..

by samatah |
నేషనల్ హైవేను మించి ధర..  జిల్లా సరిహద్దుల్లో దర్జాగా టోల్ దందా..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రెండు జిల్లాల సరిహద్దుల్లో దాదాపు రెండేళ్లుగా టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం టెండర్ కు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించలేదు. అలాగని ఇక్కడ స్పెషల్ కన్సట్రక్షన్ కూడా చేయలేదు. మానేరు నదిపై వేసిన తాత్కాలిక వంతెన కోసం వసూలు చేస్తున్నారు.




ఓడెడు.. గర్మిళ్లపల్లి..

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడెడ్, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిపై వంతెన నిర్మాణం చేపడుతున్నారు. వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో తాత్కాలికంగా వంతెన నిర్మాణం చేసి టోల్ వసూళ్లకు శ్రీకారం చుట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ వాహనాలకు అయితే రూ. 500, కార్లకు రూ. వంద, బైకులకు రూ. 30 చొప్పున వసూలు చేస్తున్నారు. ఓడెడు, గర్మిళ్లపల్లి విలేజ్ డెవపల్ మెంట్ కమిటీ పేరిట వీరు రశీదులు కూడా ఇస్తుండడం గమనార్హం. గ్రామాభివృద్ది కమిటీ పేరిట టోల్ వసూలు చేస్తున్న ధరలు నేషనల్ హైవేలో కూడా లేవని అంటున్నారు వాహనదారులు. విలేజ్ డెవపల్ మెంట్ కమిటీ పేరిట దాదాపు రెండేళ్లుగా టోల్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నా నిలువరించే వారే లేకుండా పోయారన్న ఆరోపణలు ఉన్నాయి. టోల్ చెల్లించనట్టయితే వారి వాహనాలను కూడా ఎక్కడిక్కడ ఆపేసి ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు కొంతమందిని ఇక్కడ నియమించుకున్నారని కూడా తెలుస్తోంది. ప్రత్యేకంగా టోలో దండ ఏర్పాటు చేసి మరీ వసూలు చేస్తున్నట్టుగా సమాచారం.

టెండర్లు కూడా..

అయితే అనధికారికంగా ఏర్పాటు చేసిన ఈ టోల్ ప్లాజాకు స్థానికంగా ఉన్న కొంతమంది టెండర్లకు కూడా పిలుచి కాంట్రాక్ట్ అప్పగిస్తున్నారని స్థానికంగా ప్రచారంలో ఉంది. రూ. 22.20 లక్షలకు కాంట్రాక్టర్‌కు అప్పజెప్పినట్టు సమాచారం. అయితే మానేరు నదిపై టోల్ గేట్ పెట్టి వాహనాలకు ఇంతా అని వసూలు చేసేందుకు ఏ ప్రభుత్వ శాఖ అనుమతి ఇచ్చింది, అన్నది మాత్రం అంతు చిక్కడం లేదు. రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ నదిపై జరుగుతున్న వసూళ్ల తంతుపై వాహనదారులు మండిపడుతున్నారు.

నాడే బెటర్..

అయితే మానేరు నదిలో నీరు లేనప్పుడు స్థానికులు గర్మిళ్లపల్లి మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రాకపోకలు సాగేవి. దూరం కూడా తక్కువ అవుతుండడంతో చాలా మంది ఈ దారినే ఎంచుకుంటుంటారు. ఇప్పుడు దూరం భారం తగ్గుతుందని ఆ ప్రాంతం మీదుగా వెళ్తున్న వాహనదారులు టోల్ చెల్లించాల్సి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న వారు ఈ మార్గం గుండా వెలితే మాత్రం ఐడీ ప్రూఫ్ లు చూపించాలని కూడా టోల్ గేట్ సిబ్బంది పట్టుబడుతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా వీడీసీల పేరిట వసూలు చేయడమే అక్రమం కాగా, వీరు మాత్రం తాత్కాలిక వంతెన మీదుగా వెల్లే వారిని ఐడీ ప్రూఫ్ లు అడిగుతుండడం విస్మయానికి గురి చేస్తోందని ఓ వాహనదారుడు వాపోయాడు.

Advertisement

Next Story

Most Viewed