ఎస్సారెస్పీ భూముల కబ్జా..

by Mahesh |
ఎస్సారెస్పీ భూముల కబ్జా..
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ధరూర్ క్యాంప్ ఏరియాలో భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కుల కన్ను ఆ భూములపై పడింది. దీంతో సొంత భూములు ఉన్న కొందరు ఇండ్ల నిర్మాణాల పేరుతో పక్కనే ఉన్న ఎస్సారెస్పీ భూముల్లోకి పరిధి దాటి నిర్మాణాలను చేపడుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఎస్సారెస్పీ భూముల్లోనే షెడ్లు ఏర్పాటు చేసి దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు. సర్వే నంబర్ 347, 348 లోని భూముల్లో చేపట్టిన కొన్ని నిర్మాణాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇవే సర్వే నంబర్లలోని ఎస్సారెస్పీ భూములను ఆనుకొని కట్టిన ఓ అపార్ట్ మెంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు వినిపిస్తోంది. సుమారు మూడు గుంటల ఎస్సారెస్పీ స్థలాన్ని ఆక్రమించి భవనం నిర్మాణం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎస్సారెస్పీ భూమిలో షెడ్డు..

జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ కోదండరామాలయం సమీపంలో గల ఎస్సారెస్పీకి చెందిన భూమిలో షెడ్డును నిర్మించారు. సర్వే నంబర్ 347లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఓ మహిళ ఈ షెడ్డు నిర్మాణం చేపట్టింది. గతంలో ఇదే తరహాలో షెడ్డు నిర్మాణం చేపడితే ఎస్సారెస్పీ అధికారులు దానిని తొలగించినట్లు సమాచారం. అయితే తాజాగా చేపట్టిన షెడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఎయిర్ రైఫిల్ ప్రాక్టీస్ కోసం షెడ్డు వేసుకున్నట్లు తనకు అన్ని అనుమతులు ఉన్నాయని సదరు మహిళ స్థానికులతో చెబుతున్నట్లు తెలుస్తుంది. ఎస్సారెస్పీ అధికారులు మాత్రం తాము ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చి చెబుతున్నారు. అయితే ఏఈ కార్యాలయానికి కూతవేటు దూరంలో షెడ్డు నిర్మాణం చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తుంది.

వివాదాస్పదంగా బిల్డింగ్ నిర్మాణం

ధరూర్ రామాలయం రోడ్డులోనే ఎస్సారెస్పీ ల్యాండ్ పక్కనే ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే పట్టా భూమి పరిధి దాటి ఎస్సారెస్పీ భూమిలోకి నిర్మాణం రావడంతో సంబంధిత అధికారులతో పాటు మున్సిపల్ సిబ్బంది గతంలోనే నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించకపోగా రివర్స్‌లో ఎస్సారెస్పీ ఆఫీసర్లతోపాటు బల్దియా సిబ్బందిని పార్టీలుగా చేర్చి కోర్టులో కేసు వేయడం చర్చనీయాంశంగా మారింది. విషయం కోర్టు పరిధిలో ఉండగానే డీవియేషన్‌కు పాల్పడిన సదరు వ్యక్తి కన్స్ట్రక్షన్ మాత్రం ఆపడం లేదు. కోర్టు కేసు సంగతి అంటుంచితే డీవియేషన్‌కు పాల్పడితే తొలగించే అధికారం మున్సిపల్ సిబ్బందికి ఉన్నప్పటికీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఏఈ పొంతన లేని సమాధానాలు..

ఎస్సారెస్పీ స్థలంలో షెడ్ వేసిన విషయంపై మొదట కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఓ ఏఈని వివరణ అడుగగా డీఈ నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. తాత్కాలిక అనుమతి తీసుకున్నారని దిశ ప్రతినిధిని మిస్ గైడ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే పర్మిషన్ కాపీ కావాలని కోరగా ఇవ్వడానికి కుదరదు అని చెప్పడంతో ‘దిశ’ ఈఈ ఏహెచ్ ఖాన్‌ను సంప్రదించింది. స్పందించిన ఈ ఈ వెంటనే సదరు ఏఈని పిలిపించి విషయంపై ఆరా తీశారు. మిస్ గైడ్ చేసిన ఏఈ పై మండిపడ్డారు. షెడ్డు విషయంలో ఓ మహిళ పర్మిషన్ ఇవ్వాలని రాతపూర్వకంగా కోరిందని, అయితే ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా అధికారులను సంప్రదించిన క్షణాల వ్యవధిలోనే షెడ్ వేసిన మహిళ ‘దిశ’ రిపోర్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఎస్సారెస్పీ భూముల సర్వేకు డిమాండ్..

ధరూర్ క్యాంప్ ఏరియా ప్రైమ్ లొకేషన్ కావడంతో మామూలుగానే భూముల రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అయితే క్యాంపులో ఎస్సారెస్పీకి చెందిన భూములు ఉండడంతో అక్రమార్కుల కన్ను ఆ భూములపై పడింది. దీంతో గతంలో నిర్మించిన పలు భవనాలు పరిధి దాటి ఎస్సారెస్పీ భూమిలో చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా మరికొందరు కబ్జా చేసే ప్రయత్నం చేసినట్లు విమర్శలు లేకపోలేదు. కాబట్టి అసలు క్యాంప్ ఏరియాలో ఎస్సారెస్పీకి గతంలో సేకరించిన భూమి ఎంత ఉంది? గత ప్రభుత్వం కుల సంఘాలకు వివిధ అవసరాల నిమిత్తం ఇతరులకు కేటాయించిన భూమి ఎంత? ప్రస్తుతం ఎస్సారెస్పీకి ఎంత భూమి ఉంది అనేది సర్వే చేసి నిర్ధారించాలని డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే అధికారులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.

షెడ్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదు

347 సర్వే నంబర్‌లో షెడ్డు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వాలని మహిళ తమ దగ్గరకు వచ్చిన మాట నిజమే. షెడ్డు విషయంలో ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకుంటాం. ఎస్సారెస్పీ లాండ్స్‌లో ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవు.:- ఏహెచ్.ఖాన్, ఈఈ, ఎస్సారెస్పీ

Advertisement

Next Story

Most Viewed