బఫర్ జోన్ల భూములపై అధికార పార్టీ నేతల కన్ను.. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు

by Hamsa |   ( Updated:2023-05-26 03:51:34.0  )
బఫర్ జోన్ల భూములపై అధికార పార్టీ నేతల కన్ను.. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు
X

అధికార పార్టీ నేతల భూదాహానికి ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాల పట్టణం చుట్టూ ఉన్న చెరువులు కుదించుకుపోతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రానికి ఆనుకుని సర్వే నంబర్ 406లో ఉన్న మోతె చెరువు మొత్తం విస్తీర్ణం రికార్డుల ప్రకారం 90.23ఎకరాలు. అయితే పదేళ్ల నుంచి ఈ చెరువు స్థలం క్రమంగా కబ్జాకు గురవుతుందని పెద్దఎత్తున విమర్శలు ఉన్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న జగిత్యాల పట్టణ శివారు ప్రాంతాల్లో ఈ భూములకు మంచి ధర పలుకుతుండడంతో అక్రమార్కుల కన్ను పడింది. దీంతో 90ఎకరాలకు పైగా ఉన్న చెరువు విస్తీర్ణం 40ఎకరాలకు కుదించుకుపోయిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు ఎస్టీఎల్ భూములతోపాటు శిఖం భూములు కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు. కొంతమంది అవినీతి అధికారులు సైతం కబ్జాదారులకు వత్తాసు పలకడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఉన్నతాధికారులు కలుగజేసుకొని అక్రమ నిర్మాణాలను కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేస్ స్టడీ : ఈ ఫోటోలో కనిపిస్తున్న స్థలం జగిత్యాల మోతే చెరువు కట్ట పక్కనే ఉంది. అధికారులు ఈ స్థలాన్ని ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) జోన్‌గా గుర్తించారు. ఇలా గుర్తించిన జోన్‌లలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని రూల్స్ ఉన్నాయి. అయితే రూల్స్‌కు విరుద్దంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు ఆ స్థలంలో ఏకంగా చెరువు కట్ట వెంట నిర్మాణం మొదలు పెట్టాడు. దీన్ని గుర్తించిన మున్సిపల్ అధికారులు వెంటనే నిర్మాణాన్ని ఆపివేయాలని నోటీసులు సైతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే మోతె చెరువు శివారు ప్రాంతంలో ఇప్పటికే ఇటువంటి నిర్మాణాలు పదుల సంఖ్యలో జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని రోజులు బఫర్ జోన్లకే పరిమితమైన ఈ అక్రమ నిర్మాణాలు ఇప్పుడు క్రమంగా ఎఫ్టీఎల్ భూములకు సైతం వ్యాపించాయి.

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకుని మోతె చెరువు ఉంటుంది. సర్వే నంబర్ 406లో ఉన్న ఈ చెరువు మొత్తం విస్తీర్ణం రికార్డుల ప్రకారం 90.23ఎకరాలు. అయితే పదేళ్ల నుంచి ఈ చెరువు స్థలం క్రమంగా కబ్జాకు గురవుతూ వస్తుందని పెద్దఎత్తున విమర్శలు ఉన్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న జగిత్యాల పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న భూములకు మంచి ధర పలుకుతుండడంతో అక్రమార్కుల కన్ను ఈ భూములపై పడింది. దీంతో 90ఎకరాలకు పైగా ఉన్న చెరువు విస్తీర్ణం 40ఎకరాలకు కుదించుకుపోయిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు ఎస్టీఎల్ భూములతోపాటు శిఖం భూములు కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్మేశారు. 269నుంచి 319సర్వే నంబర్ల వరకు 790ఎకరాల శిఖం భూమి ఉంది. కాగా, ఇందులో 60ఎకరాలకు పైగా కబ్జా చేశారు. ఇలా కబ్జా చేసిన భూముల్లో దాదాపు 300వరకు ఇండ్లు కట్టారు.

అధికార పార్టీ నేతల కన్ను..

జగిత్యాల జిల్లా ఆవిర్భావానికి ముందు పనిచేసిన రెవెన్యూ అధికారులు చెరువు శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న భూములు కబ్జాకు గురికాకుండా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా రూపొందించిన నివేదికలను రెవెన్యూ శాఖ మున్సిపాలిటీలకు అప్పగించింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా జిల్లా ఆవిర్భావం తర్వాత భూముల ధరలకు రెక్కలు రావడంతో కాలక్రమేనా కబ్జాలకు గురవుతూ వస్తున్నాయి. ఇటీవల అధికార పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు వివాదాల్లో ఉన్న భూములు, శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతూ లక్షల్లో దండుకుంటున్నారు. ఆ భూములు కూడా రూ.కోట్లు విలువ చేయడంతో కొంతమంది అధికారులకు ముడుపులు ఇస్తూ గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణాలు చేపడుతూ చెరువు భూములు కొల్లగొడుతున్నారు.

కబ్జాకు గురవుతున్న 5 పాండ్స్ ఆఫ్ సిటీ భూములు..

జగిత్యాల పట్టణం చుట్టూ ఉన్న ఐదు అనుబంధ చెరువులను కలిపి 5 పాండ్స్ ఆఫ్ సిటీ అని పిలుస్తారు. అందులో మోతె చెరువు, అంతర్గాం చెరువు, చింతకుంట చెరువు, కండ్లపల్లి, గోవింద్ పల్లె చెరువులు ఉన్నాయి. ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు. వీటిలో మోతె చెరువే పెద్దది. దీనికి అంతర్గాం శివారు నుంచి ధరూర్, నర్సింగాపూర్ మీదుగా కాలువ ద్వారా నీళ్లు వచ్చేవి. ఈ కాలువ దాదాపు 80ఫీట్ల వెడల్పు ఉండేది. అయితే ధరూర్, నర్సింగాపూర్‌లో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ వ్యాపారులు కాలువను తగ్గించారు. ఫలితంగా మోతె చెరువుకు వచ్చే నీళ్లు తగ్గాయి. దీంతో చెరువు చిన్నదైపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ లీడర్ల అండతో ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాట్లు చేసి అమ్మేశారు. దీనికి కొంతమంది అవినీతి అధికారులు వత్తాసు పలకడంతో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఈ విషయంలో కలుగజేసుకొని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కట్టడి చేయకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more:

కాంటాలు కాక అన్నదాతల తిప్పలు.. సమస్యలు పట్టించుకోని అధికార యంత్రాంగం

Advertisement

Next Story

Most Viewed